Hamas: దాడులకు ముందు భారీగా షార్ట్‌ సెల్లింగ్‌.. రూ.కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు!

హమాస్‌ దాడి సమాచారం ముందే తెలిసిన కొందరు ఇన్వెస్టర్లు ఐదు రోజుల ముందు ఇజ్రాయెల్‌ కంపెనీల షేర్లను (Short Selling) భారీగా కొనుగోలు చేశారట. 

Published : 06 Dec 2023 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు చేసిన మెరుపుదాడి భీకర యుద్ధానికి (Israel Hamas Conflict) దారితీసింది. ఈ క్రమంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్‌ దాడి సమాచారం ముందే తెలిసిన కొందరు ఇన్వెస్టర్లు ఐదు రోజుల ముందు ఇజ్రాయెల్‌ కంపెనీల షేర్లను (Short Selling) భారీగా కొనుగోలు చేశారట. అనంతరం వీటిద్వారా రూ.కోట్లను సంపాదించినట్లు సమాచారం. వీరిలో హమాస్‌ మిలిటెంట్లు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ట్రేడింగ్‌ ఆన్‌ టెర్రర్‌’ (Trading on Terror) పేరుతో అమెరికా నిపుణులు చేసిన పరిశోధన నివేదికతో ఇజ్రాయెల్‌ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

హమాస్‌ దాడులకు ఇజ్రాయెల్‌ స్టాక్‌మార్కెట్‌ల తీరుపై ‘ట్రేడింగ్‌ ఆన్‌ టెర్రర్‌’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ జాక్సన్‌ జూనియర్‌, కొలంబియా యూనివర్సిటీకి చెందిన జొషువా మిట్స్‌ అధ్యయనం చేశారు. వీటికి సంబంధించిన తాజా నివేదికను పరిశీలనకు ఉంచారు. ఇజ్రాయెల్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడ్‌ ఫండ్‌ (ETF) పరిశీలిస్తే సాధారణంగా రోజుకు ఏడువేల షేర్లు తగ్గిపోతాయని.. కానీ, అక్టోబర్‌ 2న మాత్రం ఈ సంఖ్య ఏకంగా 2.27లక్షలకు చేరినట్లు గుర్తించారు. ఈ తరహా షార్ట్‌ సెల్లింగ్‌ ఆర్థికంగా, గణాంకపరంగా అసాధారణమైనవిగా పేర్కొన్నారు.

అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం

అమెరికా, టెల్‌ అవీవ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నిర్దిష్ట ఇజ్రాయెల్‌ కంపెనీల నుంచి ఈ కొనుగోళ్లు కనిపించాయని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై దాడి జరిగే ముందు రోజు (అక్టోబర్‌ 7) కూడా టెల్‌ అవీవ్‌ స్టాక్‌ మార్కెట్లో ఈ తరహా విక్రయాలు భారీగా పెరిగాయని అన్నారు. హమాస్‌ మిలిటెంట్లకు దీన్ని ఆపాదించడం ఊహాజనితమే అయినప్పటికీ.. అలా జరగడానికి విస్తృత అవకాశాలూ ఉన్నాయన్నారు. దాడి గురించి ముందస్తుగా తెలిసినవారే ఇలా చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

మరోవైపు నిధుల సమీకరణ విషయంలో హమాస్‌ మిలిటెంట్లతోపాటు పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థల క్రిప్టోకరెన్సీ వాడకాన్ని తాజా నివేదిక ప్రస్తావించింది. ఆగస్టు 2021 నుంచి జూన్‌ 2023 మధ్యకాలంలో పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌, హెజ్‌బొల్లా కలిపి 134 మిలియన్‌ డాలర్లకుపైగా విలువైన క్రిప్టోకరెన్సీలను తీసుకున్నారని తెలిపింది. వీరిలో హమాస్‌ ఉగ్రవాదులే 41 మిలియన్‌ డాలర్లు విలువైన క్రిప్టో కరెన్సీని సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు