Iran: పశ్చిమాసియా గడ్డపై మరో ఘర్షణ.. ఇరాక్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి

Iran: ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంలో ఉన్న పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్‌ సోమవారం ప్రకటించింది.

Updated : 16 Jan 2024 08:11 IST

టెహ్రాన్‌: ఇప్పటికే అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో మరో ఉద్రిక్తతకు తెరలేసింది. ఇరాక్‌ (Iraq)లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంపై దాడులు చేసినట్లు ఇరాన్‌ (Iran) సోమవారం ప్రకటించింది. ఎర్బిల్‌ పట్టణంలోని ‘గూఢాచార స్థావరాలు, ఇరాన్‌ వ్యతిరేక ఉగ్రవాద సంస్థల’ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించినట్లు ‘ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌’ వెల్లడించింది. సిరియాలోని ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ శిబిరాలను సైతం ధ్వంసం చేసినట్లు చెప్పింది. కుర్దిస్థాన్‌ రాజధాని ఎర్బిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఇరాక్‌లో (Iraq) కుర్దిస్థాన్‌ ప్రాంతంలోని ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మొస్సాద్‌ ప్రధాన కార్యాలయంపైనా దాడి చేసినట్లు ఇరాన్‌ (Iran) ప్రకటించింది. దాడులను ‘కుర్దిష్‌ ప్రాంతీయ ప్రభుత్వ భద్రతా మండలి’ ధ్రువీకరించింది. నలుగురు పౌరులు మరణించినట్లు తెలిపింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. చనిపోయిన వారిలో పెష్రా దిజాయి అనే స్థానిక వ్యాపారవేత్త, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు వెల్లడించింది. ఎర్బిల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి జరిగినట్లు ఇరాక్‌కు చెందిన ఓ భద్రతాధికారి సైతం ధ్రువీకరించారు.

ఈ దాడుల్లో అమెరికా అధికారులకు ఎలాంటి హానీ జరగలేదని శ్వేతసౌధంలోని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్‌ వాట్సన్‌ తెలిపారు. ఎర్బిల్‌పై కనీసం అయిదు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇరాన్‌ చేసిన ఈ దాడులు ‘నిర్లక్ష్యపూరితంగా, నిర్దిష్టమైన గమ్యం లేనివి’గా ఉన్నాయని పేర్కొన్నారు.

కుర్దిస్థాన్ ప్రాంతీయ భద్రతా మండలి స్పందిస్తూ.. ఇరాన్‌ (Iran) దుందుడుకు చర్యలు తమ ప్రాంతంతో పాటు ఇరాక్‌ (Iraq) సార్వభౌమాధికారంపై దాడిగానే భావిస్తున్నామని తెలిపింది. ఈ నేరాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

2020లో అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ (Iran) జనరల్‌ ఖాసిం సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం ఇరాన్‌లోని కెర్మన్‌లో ఉన్న సమాధి వద్ద ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 84 మంది చనిపోగా, 284 మంది గాయపడ్డారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే, ఇది ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ పనేనని ఇరాన్‌ ఆరోపిస్తోంది.

ఇరాన్‌ మద్దతున్న హౌతీ రెబెల్స్‌ ఇటీవల ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై ఇటీవల ప్రతీకార దాడులు చేశాయి. మరోవైపు ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమై ఆదివారంతో 100 రోజులు ముగిశాయి. ఇప్పటికీ ఈ ఘర్షణలకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. హెజ్‌బొల్లా సైతం ఇజ్రాయెల్‌పై ఇటీవల దాడులకు దిగింది. ఇలా పశ్చిమాసియా ప్రాంతం వరుస ఘర్షణలతో అట్టుడుకుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని