Iran Israel conflict: ఇరాన్‌ చేతుల్లోకి వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులు..!

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ.. హార్మూజ్‌ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్‌ కమాండోలు.. దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో 17 మంది భారతీయులు ఉండటం గమనార్హం.

Updated : 13 Apr 2024 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ (Israel)- ఇరాన్‌ (Iran)ల మధ్య తార స్థాయికి చేరిన ఉద్రిక్తతలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ పరిణామాల నడుమ హార్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్‌ కమాండోలు దాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్‌.. వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

హెలికాప్టర్‌ సాయంతో నౌకను వెంబడించిన నేవీ ప్రత్యేక బలగాలు దాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్లు టెహ్రాన్‌ మీడియా తెలిపింది. అంతకుముందు బ్రిటన్‌కు చెందిన యూకే మారిటైమ్‌ ఏజెన్సీ (UKMTO) కూడా నౌక సీజ్‌ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం దాన్ని ఇరాన్‌ ప్రాదేశిక జలాల వైపు మళ్లించిట్లు సమాచారం. పోర్చుగల్‌ జెండాతో ఉన్న ఆ వాణిజ్య నౌకను.. ఇజ్రాయెల్‌ కుబేరుడు ఇయాల్‌ ఒఫర్‌ ‘జోడియాక్‌’ సంస్థకు చెందిన ఎంఎస్‌సీ ఏరిస్‌ (MSC Aries)గా భావిస్తున్నారు.

నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా.. ఇరాన్‌ దాడికి ఎంతో సమయం లేదన్న బైడెన్‌

కొద్దిరోజుల క్రితం సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్‌ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్‌పై ఆగ్రహంతో రగులుతోన్న ఇరాన్‌.. ప్రతిదాడి తప్పదని హెచ్చరిస్తోంది. అలాగే తమ మధ్యలో అమెరికా తలదూర్చకూడదని కోరింది. ఇదే జరిగితే.. ఇజ్రాయెల్‌- హమాస్‌ల వరకే పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని