Joe Biden: నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా.. ఇరాన్‌ దాడికి ఎంతో సమయం లేదన్న బైడెన్‌

Israel-Iran: తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దాడితో రగిలిపోతున్న ఇరాన్‌.. ఏ క్షణమైనా ప్రతిదాడి చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. 

Updated : 13 Apr 2024 16:36 IST

వాషింగ్టన్‌: ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌ (Israel)పై ఇరాన్‌ (Iran) దాడి చేయొచ్చన్న సంకేతాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్‌అవీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందన్న నిఘా వర్గాల సమాచారం ధ్రువీకరించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Jeo Biden) స్పందించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేస్తారని ఆయన అంచనా వేశారు. ‘‘నేను రహస్య సమాచారం జోలికి వెళ్లాలనుకోవడం లేదు. దాడికి మాత్రం ఎంతో సమయం లేదని నా అంచనా. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇరాన్ విజయం సాధించదు’’ అని స్పష్టం చేశారు. ‘‘చేయకండి’’ అంటూ ఒక్క పదంలో ఇరాన్‌కు సందేశం పంపారు.

ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో దాడికి ఇరాన్‌ సమాయత్తం

తాము ఇజ్రాయెల్‌ ఫిరంగి దళంపై డజన్ల కొద్ది క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని ఆ గ్రూప్‌ స్థావరాలపై ఇటీవల ఇజ్రాయెల్‌ సేనలు జరిపిన దాడులకు ప్రతీకారంగా వీటిని చేపట్టినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. తన మిత్రదేశంతో పాటు తన బలగాలను రక్షించుకునేందుకు విధ్వంసక నౌకలను, అదనపు సైనిక సామగ్రిని పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఒకవైపు సైనిక సన్నద్ధతను పెంచుతూనే.. మరోపక్క ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.

కొద్దిరోజుల క్రితం సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్‌ ఆగ్రహంతో రగులుతోంది. ఇజ్రాయల్‌పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. అలాగే తమ మధ్యలో అమెరికా తలదూర్చకూడదని కోరింది. ఇదే జరిగితే.. ఇజ్రాయెల్‌- హమాస్‌ల వరకు పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని