Mohammad Mokhber: ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ నియమితులయ్యారు.

Published : 20 May 2024 17:51 IST

టెహ్రాన్‌: ఇరాన్‌ (Iran) తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ (Mohammad Mokhber) నియమితులయ్యారు. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) తాజాగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ రాజ్యాంగం ప్రకారం ఇరాన్‌ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీంలీడర్‌ ఖమేనీ ఆమోద ముద్ర అవసరం. అనంతరం ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పార్లమెంట్ స్పీకర్‌, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ క్రమంలోనే 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

ఇరాన్‌ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్‌.. బైరక్తర్‌ అకిన్సి విశేషాలు..!

1955లో ఇరాన్‌లోని డెజ్‌ఫుల్‌లో జన్మించిన మొఖ్బర్‌.. ప్రస్తుతం దేశ ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 1980ల్లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఐఆర్‌జీసీ మెడికల్ కోర్‌లో అధికారిగా ఉన్నారు. ఖుజెస్థాన్‌ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు. టెలికమ్యూనికేషన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో అనుభవం ఉంది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో మాస్కోకు డ్రోన్లు, క్షిపణుల సరఫరా ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అణు, బాలిస్టిక్‌ క్షిపణి కార్యకలాపాల్లో ప్రమేయంపై యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఆంక్షలూ ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని