Ebrahim Raisi: టెహ్రాన్‌లో రైసీకి నివాళి

హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్‌ అమిర్‌ అబ్దొల్లాహియన్‌ సహా ఇతరులకు ఇరాన్‌ ప్రభుత్వం బుధవారం అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులు అర్పించింది.

Published : 23 May 2024 06:18 IST

ప్రార్థనల్లో పాల్గొన్న ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ
హాజరైన వివిధ దేశాల ప్రధానులు, ప్రతినిధులు

ఇబ్రహీం రైసీకి నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

దుబాయ్‌: హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్‌ అమిర్‌ అబ్దొల్లాహియన్‌ సహా ఇతరులకు ఇరాన్‌ ప్రభుత్వం బుధవారం అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులు అర్పించింది. రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరాన్‌ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్నారు. ఇరాన్‌ జెండాలతో ఉన్న శవపేటికల ముందు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శవపేటికలను ప్రజలు తమ భుజాల మీద మోశారు. ఈ యాత్రలో భారీ సంఖ్యలో పౌరులు నల్లదుస్తులు ధరించి పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2020లో ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ అంతిమయాత్ర సమయంలో బహిరంగంగానే ఏడ్చిన ఖమేనీ ఈసారి భావోద్వేగాలను నియంత్రించుకున్నారు. ‘‘ఓ అల్లా.. మేం అతనిలో మంచిని తప్ప ఏమీ చూడలేదు’’ అని అరబిక్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడైన మహమ్మద్‌ మొఖ్బర్‌ మాత్రం రోదిస్తూ కనిపించారు. ఖమేనీ వెళ్లిపోగానే శవపేటికలను తాకడానికి జనం పోటీపడ్డారు. షియా సంప్రదాయం ప్రకారం యాత్రలో పాల్గొన్న ప్రజలు తమ గుండెలను బాదుకుంటూ బహిరంగంగా విలపించారు. భారత్‌ తరఫున ఈ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌.. రైసీతో పాటు మరణించిన వారందరికీ అంతిమ నివాళులర్పించారు. ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడు మొఖ్బర్‌ను కూడా కలిశారు. అంతకుముందు ధన్‌ఖడ్‌ నేతృత్వంలోని భారత బృందానికి టెహ్రాన్‌ విమానాశ్రయంలో ఇరాన్‌ అధికారులు స్వాగతం పలికారు. హమాస్‌ సీనియర్‌ ప్రతినిధి ఇస్మాయిల్‌ హనియా.. ఖమేనీని కలిసి రైసీ మృతికి సంతాపం ప్రకటించారు. ఇరాక్, పాకిస్థాన్‌ ప్రధానులతో పాటు.. వివిధ దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైసీ భౌతికకాయాన్ని గురువారం ఆయన స్వస్థలం మషాద్‌కు తరలిస్తారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు