Ebrahim Raisi: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iran president Ebrahim Raisi: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ధ్రువీకరించింది.

Updated : 20 May 2024 12:46 IST

టెహ్రాన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నిన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన (Helicopter Crash) సంగతి తెలిసిందే. దీంతో సహాయక చర్యలు చేపట్టిన ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ (IRCS) ఈ ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ (Iran president Ebrahim Raisi) ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ ధ్రువీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్ (60), తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్ మలేక్‌ రహ్‌మతీ తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది.

ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కిజ్‌ కలాసీ, ఖొదావరిన్‌ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి హోస్సేన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్‌ ప్రావిన్సు ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్‌ పట్టణానికి హెలికాప్టర్‌లో ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

ఈ ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్‌కు వాయవ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశాన్ని ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్‌ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణవార్తను ఇరాన్‌ మీడియా ధ్రువీకరించింది. హెలికాప్టర్‌ శకలాల దృశ్యాలను స్థానిక మీడియా పసారం చేసింది.

రైసీ (Ebrahim Raisi) 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్‌ రౌహానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. రెండో ప్రయత్నంలో.. 2021లో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడడని ఆయనకు పేరుంది. కాగా.. ఇజ్రాయెల్, ఇరాన్‌ (Isreal-Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ, రైసీల ఆదేశాలతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బలగాలు గత నెలలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని