Iran President death: ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉందా?

మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఇరాన్‌ అధ్యక్షుడు (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్‌ (Israel) పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 20 May 2024 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అయితే, మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ రైసీ ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశమయ్యింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్‌ (Israel) పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెల్‌అవీవ్‌ స్పందించింది.  రైసీ (Ebrahim Raisi) మరణంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థకు స్పష్టంచేసింది.

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం వేళ (Israel Hamas Conflict).. సిరియాలో ఇరాన్‌కు చెందిన జనరల్‌ను నెతన్యాహు సైన్యం మట్టుపెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందుకు దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన ఇరాన్‌.. శత్రు దేశంపై డ్రోన్‌లతో విరుచుకుపడింది. వాటిని ఇజ్రాయెల్‌ దళాలు నిలువరించినప్పటికీ.. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయొచ్చనే ఆందోళన నెలకొంది. ఇలా హమాస్‌ యుద్ధం, సిరియా సంక్షోభం, ఎర్ర సముద్రంలో దాడులు తదితర కీలక పరిణామాలు ఏకకాలంలో తెరపైకి వచ్చిన సమయంలో రైసీ దుర్మరణం పలు అనుమానాలకు దారితీసింది.

ప్రాసిక్యూటర్‌ టు ప్రెసిడెంట్‌: ఎవరీ ఇబ్రహీం రైసీ..?

ఇరాన్‌లో కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు శక్తిమంతమైన నేతలు ప్రమాదంలో చనిపోవడం వెనక విదేశీ లేదా స్థానిక శత్రువుల ప్రమేయం ఉందా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇదే సమయంలో చిరకాల శత్రువుగా ఉన్న ఇజ్రాయెల్‌ పాత్రను తోసిపుచ్చలేమనే కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌తోపాటు అనేకమంది శత్రుదేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌కు ఉంది. అంతేకాకుండా ఇరాన్‌లో అనేకమంది అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్‌ హత్య చేసిన దాఖలాలు ఉన్నాయి.

ఈనేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడం.. దీనివెనక ఇజ్రాయెల్‌ హస్తం ఉండవచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే, అధ్యక్షుడిని అంతమొందించే సాహసం చేయకపోవచ్చని, ఒకవేళ అదే చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది. ఇలా భిన్న కథనాల నేపథ్యంలో స్పందించిన ఇజ్రాయెల్‌.. తమ ప్రమేయం లేదని పేర్కొంది. మరోవైపు అమెరికా చట్టసభ సభ్యుడు చక్‌ షుమెర్‌ ఈతరహా వాదనలను తోసిపుచ్చారు. కుట్ర కోణాలకు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు కనిపించలేదని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు