Pakistan: ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారు..!

పాక్‌ ప్రధాని, ఆయన ప్రతినిధులు దిగేందుకు విమానాన్ని దారి మళ్లించారు. దీంతో వందల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

Published : 10 Apr 2024 17:51 IST

లాహోర్‌: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ (Pakistan)లో ఇటీవల షహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే ప్రజా సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతిని తొలగిస్తున్నామని స్వయంగా ప్రధానే వెల్లడించారు. అధికారిక కార్యకలాపాల్లో ఎర్ర తివాచీల వినియోగంపై నిషేధం విధించారు కూడా. అయితే, ఇప్పుడు ఆయన విషయంలోనే వీఐపీ కల్చర్‌ను పాటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోన్న పాక్‌ సర్కారు.. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులోభాగంగానే ప్రధాని కూడా సామాన్య ప్రయాణికుల విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఇటీవల షహబాజ్‌ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆయనవెంట ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఉంది. వీరు పర్యటన ముగించుకుని తిరిగివస్తుండగా.. ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్‌ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్‌ వైపు దారి మళ్లించినట్లు పాక్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

భారత్‌పై ట్రూడో అబద్ధం చెబుతున్నారా..? కెనడా సర్కారుకు షాకిచ్చిన కమిషన్‌ నివేదిక

జెడ్డా నుంచి ఇస్లామాబాద్‌ వెళ్లే పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రధాని, ఆయన బృందం ప్రయాణించింది. వీరితో పాటు విమానంలో మొత్తం 393 మంది ప్రయాణికులున్నారు. వాస్తవానికి ఈ విమానం సోమవారం రాత్రి 10.30 గంటలకు ఇస్లామాబాద్‌లో దిగాల్సిఉంది. అయితే, దాన్ని దారి మళ్లించడంతో రాత్రి 9.25 గంటలకే విమానం లాహోర్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. దీంతో ప్రధాని సహా 79 మంది అక్కడ దిగిపోయారు. విమానం ఆలస్యమవడంతో ఇస్లామాబాద్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కానీ చేసేదేం లేక.. అందులోనే ఉండిపోవాల్సివచ్చింది. అనంతరం రాత్రి 11.17 గంటలకు విమానం అసలైన గమ్యస్థానానికి చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు