India-Canada: భారత్‌పై ట్రూడో అబద్ధం చెబుతున్నారా..? కెనడా సర్కారుకు షాకిచ్చిన కమిషన్‌ నివేదిక

India-Canada: కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశ ప్రధాని ట్రూడోకే షాకిచ్చాయి. అక్కడి ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకోలేదని వాటి దర్యాప్తులో తేటతెల్లమైనట్లు నివేదికను సమర్పించాయి. న్యూదిల్లీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ట్రూడో సర్కారుకు నిజంగా ఇది మింగుడు పడని విషయమే..!

Updated : 10 Apr 2024 12:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌పై కెనడా (India-Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తొలుత నిజ్జర్‌ హత్యపై న్యూదిల్లీని నిందించిన ఆ సర్కారు.. అనంతరం కెనడా ఎన్నికల్లో (Elections) భారత్‌ జోక్యం చేసుకుందంటూ విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని తాజాగా ఆ దేశ దర్యాప్తులో వెల్లడైంది. ఎన్నికల్లో భారత్‌ ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టమైంది.

కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అక్కడి విపక్షాలు ఆరోపించాయి. దీంతో ట్రూడో ప్రభుత్వం ఓ స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల దర్యాప్తులో భారత్‌ పేరును చేరుస్తూ ట్రూడో సర్కారు తీసుకున్న నిర్ణయంతో.. ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కెనడా ఆరోపణలను న్యూదిల్లీ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్‌ విధానం కాదని తేల్చి చెప్పింది. ఈ పరిణామాల వేళ దర్యాప్తునకు సంబంధించి కీలక విషయాలు తాజాగా బయటికొచ్చాయి.

కెనడా రాజకీయాల్లో భారత్‌ ఎలాంటి జోక్యం చేసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైంది. 2021 నాటి ఎన్నికలను ప్రభావితం చేసేలా న్యూదిల్లీ ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆ ఎన్నికలను పర్యవేక్షించిన సీనియర్‌ అధికారి కమిషన్‌కు వెల్లడించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని సదరు  అధికారి చెప్పినట్లు తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు కమిషన్‌ ఎదుట జస్టిన్‌ ట్రూడో బుధవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు.

కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం.. నిఘా నివేదికలో వెల్లడి!

2019, 2021లో కెనడాలో జరిగిన జాతీయ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా(China) యత్నించిందంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో గతేడాది సెప్టెంబరులో ఈ కమిషన్‌ దర్యాప్తు చేపట్టింది. కాగా.. ఆ ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనని కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (CSIS) నివేదిక వెల్లడించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని