Rafah: రక్తమోడిన రఫా

రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, అమెరికా సహా ప్రపంచమంతా మొత్తుకుంటున్నా.. ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడం లేదు. ఆదివారం రాత్రి రఫాపై భీకర వైమానిక దాడి చేసింది.

Updated : 28 May 2024 05:30 IST

ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడిలో 45 మంది పౌరుల మృతి

రఫాలో ధ్వంసమైన పునరావాస శిబిరం

 దేర్‌ అల్‌-బలాహ్‌ (గాజా స్ట్రిప్‌): రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, అమెరికా సహా ప్రపంచమంతా మొత్తుకుంటున్నా.. ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడం లేదు. ఆదివారం రాత్రి రఫాపై భీకర వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఏకంగా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. గుడారాలు తగలబడు  తున్న దృశ్యాలు, మంటల్లో కాలిపోతున్న మృతదేహాలు, అవయవాలను కోల్పోయిన చిన్నారులకు సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. వాస్తవానికి దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలి వచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని తలదాచుకుంటున్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్‌ దాడి చేయడం గమనార్హం. 

ప్రపంచదేశాల తీవ్ర ఆగ్రహం

 దాడిని ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్‌’ వేదికగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ పేర్కొన్నారు. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ తెలిపింది.    

రఫాలోని ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు 

అవును.. తప్పు చేశాం

రఫాపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో అంగీకరించారు. ‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు. మరోవైపు హమాస్‌ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

ఈజిప్టు సైనికుల మృతి

గాజా, ఈజిప్టు సరిహద్దుల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రఫా క్రాసింగ్‌ దగ్గర ఈజిప్టు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఈజిప్టు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది.

నౌకలపై విరుచుకుపడ్డ హూతీలు 

టెహ్రాన్‌: పాలస్తీనావాసులకు సంఘీభావంగా తాము ఐదు నౌకలపై దాడులు చేసినట్లు హూతీ మిలిటెంట్లు ప్రకటించారు. హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రంలో మూడు సరకు రవాణా నౌకలు, ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. దాడులకు గురైన సరకు రవాణా నౌకలను లారెగో డెజెర్ట్, ఎంసీసీ మెచెలా, మినెర్వా లీసాగా పేర్కొన్నారు. యుద్ధనౌకల పేర్లను మాత్రం వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని