Israeli hostages: గాజాలో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి.. నలుగురు బందీలను కాపాడి..!

గాజాలో హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న నలుగురు పౌరులను సురక్షితంగా కాపాడినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

Published : 08 Jun 2024 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నప్పటికీ.. గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఇటీవల సెంట్రల్‌ గాజాలో మళ్లీ దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలోనే స్థానికంగా భారీ విజయాన్ని దక్కించుకుంది. హమాస్‌ (Hamas) చెరలో బందీలుగా ఉన్న నలుగురు పౌరులను (Israel hostages) సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించింది. నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో సంక్లిష్టమైన ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి.. వారిని రక్షించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas War) మొదలు ఎక్కువ సంఖ్యలో సజీవ బందీలను కాపాడటం ఇదే మొదటిసారి. ఈవిధంగా ప్రాణాలతో బయటపడ్డవారి సంఖ్య మొత్తం ఏడుకు చేరుకుంది.

మోదీకి అభినందనలు చెప్పని పాక్‌.. ఎందుకుంటే..?

గత ఏడాది అక్టోబరులో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్‌ చేసి గాజాకు తరలించారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. నవంబరులో కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మంది విడుదలయ్యారు. ఇంకా 130 మందికిపైగా బందీలుగా ఉన్నారని టెల్‌అవీవ్‌ చెబుతోంది. అయితే, వారిలో నాలుగింట ఒకవంతు మంది చనిపోయినట్లు భావిస్తోంది. గత నెలలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో అమాయక పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రెండు వేర్వేరు దాడుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని