Iran Israel conflict: ఇజ్రాయెల్‌ వణుకుతోంది.. ఏ రాత్రైనా దాడి: ఇరాన్‌ మరో హెచ్చరిక

తమ ఎంబసీపై దాడి నేపథ్యంలో ఇరాన్‌ మరోసారి ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ఏ రాత్రైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Published : 13 Apr 2024 20:46 IST

టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై ఏ రాత్రైనా దాడి జరగొచ్చని మరోసారి ఇరాన్‌ హెచ్చరించింది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్‌ పనేనని ఆరోపిస్తున్న ఇరాన్‌.. అందుకు ప్రతీకారంగా దాడులు తప్పవని హెచ్చరించింది.

‘‘ఇరాన్‌ ఏం చేయాలనుకుంటుందో ఇజ్రాయెల్‌కు తెలియదు. ఎక్కడ దాడి జరుగుతుందోనని రాత్రుళ్లు బిక్కుబిక్కుమని చూస్తోంది. ఇప్పటికే చాలామంది షెల్టర్లలోకి పారిపోయారు. అసలైన యుద్ధం కంటే.. ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధమే వారిని మరింత భయపెడుతోంది. దీంతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది’’ అని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు యాహ్యా రహీం సఫావీ పేర్కొన్నారు.

ఇరాన్‌ చేతుల్లోకి వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులు..!

ఏప్రిల్‌ 1న ఇరాన్‌ ఎంబసీపై జరిగిన దాడి కారణంగా మరణించిన 16 మందిలో సీనియర్‌ కమాండర్లు మొహమ్మద్‌ రెజా జహేదీ, మొహమ్మద్‌ హదీ హజీ రహీమీ ఉన్నారు. వీరు ఐఆర్‌జీసీ సంబంధిత విదేశీ కార్యకలాపాల విభాగంలో సీనియర్‌ కమాండర్లుగా వ్యవహరిస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన వార్‌ మానిటర్‌ సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ వెల్లడించింది. మరోవైపు.. హార్మూజ్‌ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్‌ కమాండోలు దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నౌకలో 17 మంది భారతీయులు ఉండడంతో వారి విడుదల కోసం ఇరాన్‌ అధికారులతో భారత్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని