Israel Hamas Conflict: గాజాలో పాఠశాలపై ఇజ్రాయెల్‌ క్షిపణులు

దేర్‌ అల్‌-బలాహ్‌ (గాజా స్ట్రిప్‌): గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన పాలస్తీనియన్లు తలదాచుకున్న ఓ పాఠశాల భవనంపై గురువారం ఉదయం క్షిపణులను ప్రయోగించింది.

Published : 07 Jun 2024 06:46 IST

23 మంది మహిళలు సహా 33 మంది మృతి

దేర్‌ అల్‌-బలాహ్‌ (గాజా స్ట్రిప్‌): గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన పాలస్తీనియన్లు తలదాచుకున్న ఓ పాఠశాల భవనంపై గురువారం ఉదయం క్షిపణులను ప్రయోగించింది. సెంట్రల్‌గాజాలో జరిగిన ఈ దాడిలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 23 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో హమాస్‌ మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఈ పాఠశాలను నిర్వహిస్తోంది. ఉత్తర గాజాపై ఇజ్రాయెల్‌ దాడులతో పారిపోయి వచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ తలదాచుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ క్షిపణులు పాఠశాలలోని తరగతి గదులను తాకాయన్నారు. గత వారం కూడా హమాస్‌ ఉగ్రవాదులు తలదాచుకున్నారని పేర్కొంటూ రఫాలోని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడి చేసి, 45 మంది పాలస్తీనా పౌరులను పొట్టన పెట్టుకుంది.

నరమేధం కేసులో స్పెయిన్‌ కూడా..!

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించిన స్పెయిన్‌.. ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా వేసిన కేసులో భాగస్వామి అయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) దరఖాస్తు చేసింది. ‘‘గాజాలో జరుగుతున్న సైనిక చర్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి. ఇది జరగాలంటే అందరూ న్యాయస్థానానికి సహకరించాలి’’ అని గురువారం స్పెయిన్‌ తెలిపింది. మెక్సికో, కొలంబియా, నికరాగువా, లిబియా కూడా ఈ కేసులో తమను ఇంప్లీడ్‌ చేయమని ఐసీజేను ఇప్పటికే కోరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని