Gaza school: గాజాలో శిబిరంపై దాడి.. 33 మంది మృతి!

సెంట్రల్‌ గాజాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 33 మంది మృతి చెందారు.

Published : 06 Jun 2024 17:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గాజా (Gaza)లో వేలాదిమంది అమాయకుల మరణాలకు కారణమవుతోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతోన్నా.. ఇజ్రాయెల్‌ (Israel) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సెంట్రల్‌ గాజాలోని ఓ పాఠశాల భవనంపై జరిపిన వైమానిక దాడిలో.. అక్కడ తలదాచుకుంటున్న 33 మంది పౌరులు మృతి చెందారు. వారిలో తొమ్మిది మంది మహిళలు, 14 మంది చిన్నారులేనని స్థానిక అధికారులు తెలిపారు. అయితే.. హమాస్ (Hamar) ఉగ్రవాదులు ఆ స్కూల్‌ను తమ అడ్డాగా మార్చుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం (IDF) ఆరోపించింది.

హమాస్‌ ఉగ్రమూకలు తిరిగి ఏకమవుతున్నాయన్న సమాచారం మేరకు సెంట్రల్‌ గాజాలో ఇజ్రాయెల్‌ మరోసారి భూతల, గగనతల దాడులు ప్రారంభించింది. ఈక్రమంలోనే నుసిరత్‌లో ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ ఆధ్వర్యంలో నడిచే అల్‌-సర్దీ పాఠశాల భవనంపై క్షిపణులతో విరుచుకుపడింది. ప్రస్తుతం శరణార్థి శిబిరంగా ఉన్న ఇందులో పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ దాడిలో రెండో, మూడో అంతస్తులు ధ్వంసం కాగా.. దాదాపు 33 మంది మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమీపంలోని మరో ప్రాంతంపైనా జరిగిన దాడిలో ఆరుగురు మరణించారు.

మీపై దాడికి ఇతరులకు ఆయుధాలిస్తాం.. పాశ్చాత్య దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

హమాస్‌ ఉగ్రవాదులు ఆ పాఠశాలలో ఆశ్రయం పొందుతూ.. తమ బలగాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని టెల్‌అవీవ్‌ ఆరోపించింది. అయితే.. ఈ వాదనలకు తగిన ఆధారాలు వెల్లడించలేదు. తాజా ఘటనలో పౌర ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు వైమానిక నిఘా, అదనపు సమాచార సేకరణ వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలాఉండగా.. గతవారం రఫాలో ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ కేంద్రం సమీపంలో జరిగిన దాడిలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికా సహా ప్రపంచదేశాలు దీన్ని ఖండించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు