Putin: మీపై దాడికి ఇతరులకు ఆయుధాలిస్తాం.. పాశ్చాత్య దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

Putin: ఉక్రెయిన్‌తో యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని పాశ్చాత్య దేశాలను పుతిన్‌ హెచ్చరించారు. అదే జరిగితే తామూ ఇతర దేశాలకు ఆయుధాలిచ్చి దాడి చేసేందుకు ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

Updated : 06 Jun 2024 15:58 IST

మాస్కో: ఉక్రెయిన్‌తో తాము చేస్తున్న యుద్ధంలో (Russia Ukraine War) పాశ్చాత్య దేశాల జోక్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (Putin) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది అలాగే కొనసాగితే తమ మిత్రదేశాలను ఉసిగొల్పుతామని పరోక్షంగా హెచ్చరించారు. జర్మనీ తమ ఆయుధాలను ఉక్రెయిన్‌తో ప్రయోగింపజేస్తోందని ఆరోపించారు. దీన్ని చాలా ‘ప్రమాదకరమైన చర్య’గా అభివర్ణించారు. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత బుధవారం పుతిన్ తొలిసారి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

జర్మనీది మాపై ప్రత్యక్ష దాడే..

జర్మనీ తమ ఆయుధాల ప్రయోగాన్ని నిలువరించకపోతే.. తామూ ఇతర దేశాలకు దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలను సరఫరా చేస్తామని పుతిన్‌ (Vladimir Putin) అన్నారు. తద్వారా పాశ్చాత్య దేశాల్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు ప్రోత్సహిస్తామని హెచ్చరించారు. జర్మనీ కవ్వింపు చర్యల వల్ల మొత్తం అంతర్జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇది తమ దేశంపై ప్రత్యక్ష దాడిగానే భావిస్తామని తెలిపారు. దీన్ని తిప్పికొట్టే హక్కు తమకు ఉంటుందని పేర్కొన్నారు.

కొరియన్‌ ద్వీపకల్పంపై బి-1బి బాంబర్‌ చక్కర్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై..

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పెద్ద మార్పేమీ ఉండదని పుతిన్‌ స్పష్టం చేశారు. అగ్రరాజ్య ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా.. వాళ్లతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ట్రంప్‌ దోషిగా తేలడంపై స్పందిస్తూ.. ‘‘అంతర్గత రాజకీయ పోరులో భాగంగా న్యాయ వ్యవస్థను ఉపయోగించుకున్న ఫలితమే’’నని వ్యాఖ్యానించారు.

అణ్వస్త్ర ప్రయోగంపై..

అణ్వస్త్ర ప్రయోగాలపైనా పుతిన్‌ స్పందించారు. తాము ఎప్పుడూ ముందస్తుగా అణుబాంబులను ఉపయోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ, ఇతర దేశాలు తమ భద్రతకు ముప్పు తలపెడితే మాత్రం ఎలాంటి చర్యలకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల తాము ఏం కోల్పోయామో చెప్పలేమని అన్నారు. అయితే, తమ కంటే ఉక్రెయిన్‌ సైనికులు ఐదింతలు అధికంగా మరణించారని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ వద్ద 1,300 మంది రష్యా సైనికులు బందీలుగా ఉన్నారని వెల్లడించారు. తమ వద్ద వాళ్ల సైనికులు 6,400 మంది ఉన్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని