Israel Hamas War: యుద్ధం ‘తల్లి’ ప్రాణం తీస్తే.. వైద్యులు ‘గర్భస్థ శిశువు’కు ఊపిరిపోశారు!

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో గాజాలో ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 మంది చిన్నారులను ప్రాణాలు కోల్పోయారు.

Published : 22 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ బిడ్డ ఊపిరిపోసుకోకముందే.. యుద్ధం ఆమె తల్లి ఆయువు తీసింది. ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న తండ్రి, మూడేళ్ల సోదరినీ కబళించింది. అయినా.. ఆ గర్భస్థ శిశువు మాత్రం మృత్యుంజయురాలిగా నిలిచి, ఈ లోకంలోకి అడుగుపెట్టింది. మరోవైపు అదే రణరక్కసి (Israel Hamas War).. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 మంది చిన్నారులను బలిగొంది. ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడులతో నెత్తురోడుతున్న గాజా (Gaza)లో తాజాగా చోటుచేసుకున్న ఘటనలివి. రెండు వేర్వేరు దాడుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 22 మంది మృతి చెందారు.

లక్షలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్న రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఓ దాడిలో 30 వారాల గర్భిణిగా ఉన్న ఓ మహిళ, ఆమె భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఇది గుర్తించిన వైద్యులు చనిపోయిన ఆ మహిళకు హుటాహుటిన శస్త్రచికిత్స నిర్వహించి.. బిడ్డను కాపాడారు. 1.4 కిలోల బరువుతో పుట్టిన ఆడశిశువు ప్రస్తుతం ఇంక్యుబేటర్‌లో ఉందని, ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ‘‘వీర మహిళ సబ్రీన్‌ అల్‌-సకానీ తనయ’’ అని రాసి ఉన్న లేబుల్‌ను ఆ పసిపాపకు చుట్టారు.

ఇజ్రాయెల్‌ దళంపై అమెరికా ఆంక్షలు?.. మండిపడ్డ నెతన్యాహు!

మరో ఇంటిపై జరిగిన దాడిలో.. 17 మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఉమ్మడి కుటుంబానికి చెందినవారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరో వ్యక్తి, ముగ్గురు పిల్లలు ఇంకా శిథిలాల కిందే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆరునెలలకుపైగా సాగుతోన్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 34 వేలమందికిపైగా పాలస్తీనీయన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని