Israel: ‘అక్టోబర్‌ 7న మీ కళ్లు ఎటుపోయాయి’: సూటిగా ప్రశ్నించిన ఇజ్రాయెల్‌

బందీల కోసం తాము చేస్తోన్న పోరాటం కారణంగా.. రఫాలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై వస్తోన్న వ్యతిరేకతపై ఇజ్రాయెల్ (Israel) తీవ్రంగా స్పందించింది. తమపై హమాస్ దాడి చేసినప్పుడు ఈ స్పందన ఎటుపోయిందని ప్రశ్నించింది. 

Published : 30 May 2024 10:26 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas) మధ్య జరుగుతోన్న పోరులో ఎన్నో అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో చిన్నారులు, మహిళలతో సహా 45 మంది ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయ సమాజాన్ని కలచివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు.. 'All Eyes On Rafah' అనే ఇమేజ్‌ను షేర్ చేస్తూ కాల్పులు విరమణకు పిలుపునిస్తున్నారు. దీనిపై ఇజ్రాయెల్‌ నుంచి తీవ్రమైన స్పందన వచ్చింది.

గత ఏడాది అక్టోబర్ ఏడున హమాస్‌ జరిపిన దాడి గురించి ఎందుకు పోస్టు చేయలేదని, ఆ రోజు మీ దృష్టి ఎక్కడుందని ఎదురుప్రశ్నించింది. ఆనాటి నరమేధాన్ని ప్రతిబింబించే ఒక దృశ్యాన్ని షేర్ చేసింది. ‘‘మేం అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఎప్పటికీ ఆపం. బందీలు విడుదలయ్యేవరకు మా పోరాటాన్ని ఆపం’’ అని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. 'All Eyes On Rafah' నెట్టింట్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రాంలో 45 మిలియన్ల మంది దానిని షేర్ చేశారు. వారిలో భారత సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

దాదాపు ఏడు నెలల క్రితం ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ జరిపిన దాడిలో దాదాపు 1,160 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మంది బందీలుగా మారారు. మృతులు, బాధితుల్లో చాలామంది సామాన్య పౌరులే ఉన్నారు. మధ్యలో జరిగిన కాల్పులు విరమణ ఒప్పందం కారణంగా కొందరు బందీలు విడుదలైనప్పటికీ..ఇంకా 99 మంది మిలిటెంట్ల వద్దే ఉన్నారని బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం భావిస్తోంది. హమాస్ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తోన్న పోరులో 36 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి స్థానిక యంత్రాంగం చెప్తోంది. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తోన్నప్పటికీ.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌(IDF) దక్షిణ గాజాలోని రఫా నగరంతో  పోరును ఉద్ధృతం చేస్తోంది. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని