Israel-Hamas: ‘శత్రువులు మూల్యం చెల్లించుకోవడం మొదలైంది’.. గ్రౌండ్‌ ఆపరేషన్‌పై నెతన్యాహు

Israel-Hamas Conflict: హమాస్‌ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో అడుగుపెట్టింది. గ్రౌండ్‌ ఆపరేషన్‌కు ముందు తనిఖీలు చేపట్టింది. మరోవైపు హమాస్‌ చెరలో 120 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

Updated : 14 Oct 2023 11:11 IST

టెల్‌ అవీవ్‌: హమాస్‌ (Hamas) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ (Israel).. ఇప్పుడు భూతల దాడులకు (గ్రౌండ్‌ ఆపరేషన్‌) సిద్ధమైంది. ఇజ్రాయెల్‌ బలగాలు శుక్రవారం గాజా (Gaza) భూభాగంలోకి అడుగుపెట్టాయి. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పందించారు. హమాస్‌ మూల్యం చెల్లించుకోవడం మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని మరోసారి హెచ్చరించారు. (Israel - Hamas Conflict)

హమాస్‌తో యుద్ధం వేళ.. నెతన్యాహు శుక్రవారం రాత్రి దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన శత్రువులు వారు చేసిన పనికి మూల్యం చెల్లించుకోవడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో ఇప్పుడే నేను చెప్పలేను. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎన్నడూ లేనంత బలంగా ఈ యుద్ధాన్ని మేం ముగిస్తాం. శత్రువులు మాపై పాల్పడిన అరాచకాలను మేం ఎన్నటికీ మర్చిపోలేం. వారిని ఎప్పటికీ క్షమించలేం. హమాస్‌ను సమూలంగా నాశనం చేస్తాం’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. గాజా భూభాగంలో తనిఖీలు మొదలుపెట్టినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే నెతన్యాహు ఈ ప్రసంగం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

శుక్రవారం గాజాలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్‌ బలగాలు.. స్థానికంగా సోదాలు చేపట్టాయి. ఇజ్రాయెల్ భూభాగంలో చొరబడేందుకు బయలుదేరిన యాంటీ ట్యాంగ్‌ గైడెడ్‌ మిసైల్‌ స్క్వాడ్‌ను అడ్డుకున్నాయి. బందీలను ఉంచిన ప్రాంతాల ఆనవాళ్ల కోసం అన్వేషిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.

ఆ తరహా పోరులో చిక్కులెన్నో..

హమాస్‌ చెరలో 120 మంది..

ఇదిలా ఉండగా.. గాజాలో హమాస్‌ ఉగ్రవాదుల చెరలో ఇజ్రాయెల్‌, ఇతర దేశాలకు చెందిన 120 మందికి పైగా పౌరులు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది.

ఇజ్రాయెల్ ఆదేశాలు అత్యంత ప్రమాదకరం: ఐరాస

మరోవైపు, గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సన్నద్ధమవుతున్న ఇజ్రాయెల్‌ బలగాలు.. నిన్న ఉత్తర గాజాలోని పాలస్తీనీయులకు హెచ్చరికలు చేశాయి. 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని ఆదేశించాయి. దీంతో ప్రాణభయంతో అనేక మంది వలసబాట పట్టారు. కార్లు, ట్రక్కుల్లో.. గాడిదలు లాగే బండ్లలో.. దుప్పట్లు, ఇతర సామాన్లు సర్దుకొని చాలామంది బిక్కుబిక్కుమంటూ గాజా సిటీని వీడుతూ కనిపించారు. దీంతో ఇజ్రాయెల్‌ ఆదేశాలను ఐక్యరాజ్యసమితి (UN) తీవ్రంగా ఖండించింది. ఉత్తర గాజాలో ప్రజల సంఖ్య దాదాపు 11 లక్షలు. వారందరూ 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం అసాధ్యమని, ఇజ్రాయెల్ అల్టిమేటం అత్యంత ప్రమాదకరమని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని