Israel: ఆ తరహా పోరులో చిక్కులెన్నో..

గాజాలో భూతల పోరుకు నడుంబిగించిన ఇజ్రాయెల్‌కు తమ లక్ష్యాల్ని నెరవేర్చుకోవడం అంత సులువు కాదు. కిక్కిరిసిన జనాభా, సంక్లిష్ట భౌగోళిక స్వరూపం కలిగిన గాజాలో పలు కష్టనష్టాలను భరిస్తూ ఇజ్రాయెల్‌ సైన్యం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

Updated : 14 Oct 2023 06:15 IST

గాజాలో భూతల పోరుకు నడుంబిగించిన ఇజ్రాయెల్‌కు తమ లక్ష్యాల్ని నెరవేర్చుకోవడం అంత సులువు కాదు. కిక్కిరిసిన జనాభా, సంక్లిష్ట భౌగోళిక స్వరూపం కలిగిన గాజాలో పలు కష్టనష్టాలను భరిస్తూ ఇజ్రాయెల్‌ సైన్యం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ దేశం ఎదుర్కొనబోయే కొన్ని ముఖ్యమైన సమస్యలు..

1  ఇరుకు సందుల్లో..

అతి తక్కువ స్థలంలో ఇబ్బడిముబ్బిడిగా భవనాలు, ఇళ్లు, రోడ్లతో పద్మవ్యూహాన్ని తలపించేలా ఉంటుంది గాజా! వీటన్నింటి మధ్య ఉన్న చిన్న రోడ్లలో భారీ యుద్ధట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు ప్రయాణించటం అంత సులభం కాదు. అనూహ్యమైన ఈ మలుపుల నుంచే హమాస్‌ ఎదురుదాడులు చేసే ప్రమాదం కూడా ఉంది. పజిళ్లను పోలిన ఇళ్లు, నల్లని అద్దాల వెనక నుంచి ఎక్కడి నుంచైనా బుల్లెట్ల వర్షం కురిసే అవకాశాలు మెండు. 2014లో ఇలాగే లోనికి వచ్చిన ఇజ్రాయెల్‌ సైన్యాన్ని వివిధ మలుపుల వద్ద ఉంచి రాకెట్లు, మోర్టార్లు, మిసైళ్లు, ఆర్‌పీజీలు, మిషిన్‌గన్లు, చిన్నచిన్న ఆయుధాలతో తిప్పలు పెట్టింది హమాస్‌!

2  మ్యాన్‌పాడ్‌లతో..

ఇలాంటి ఇరుకు చోట్ల యాంటీ ట్యాంక్‌ మిసైళ్లు, రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రేనేడ్ల ముందు భారీ యుద్ధట్యాంకులతో కూడిన సైన్యం ఎందుకూ పనికిరాకుండా పోతుందన్నది ఉక్రెయిన్‌, సిరియాలు నేర్పిన అనుభవం. పైగా మ్యాన్‌పోర్టబుల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (మ్యాన్‌పాడ్‌)లు హమాస్‌ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో తక్కువ ఎత్తులో ఎగిరే ఫ్లైయిట్లను కూడా దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇప్పటికే చిన్నచిన్న రాకెట్లు, మోర్టార్లను వేల సంఖ్యలో హమాస్‌ సమకూర్చుకుంది. వారం కిందట ఇజ్రాయెల్‌పై దాడి సందర్భంగా మూడు గంటల వ్యవధిలోనే 4500కుపైగా రాకెట్లను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.

3    డ్రోన్లు

ఈసారి యుద్ధంలో హమాస్‌ అమ్ములపొదిలో సరికొత్తగా చేరిన ఆయుధాలు డ్రోన్లు. వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న చిన్నచిన్న డ్రోన్ల ద్వారా బాంబులు జారవిడవటమేగాకుండా.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా వినియోగించిన భారీ డ్రోన్లు కూడా తమవద్ద ఉన్నట్లు హమాస్‌ ఇటీవల విడుదల చేసిన వీడియోల ద్వారా వెల్లడించింది. ఇవి ఇరాన్‌ నుంచి సరఫరా అయ్యాయనేది బహిరంగ రహస్యం. 

4    టన్నెళ్ల యుద్ధం

గాజా నిండా భూగర్భ టన్నెళ్లే! ఇవన్నీ హమాస్‌కు సురక్షిత కేంద్రాలు. తన బలగాలు, ఆయుధాలను చకచకా ఒకచోటి నుంచి మరోచోటికి తరలించుకోవటమేగాకుండా... మెరుపుదాడులకు వెసులుబాటునిచ్చేవివే. 2014 దాడిలో ఇజ్రాయెల్‌ సైన్యం అనేక టన్నెళ్లను కూల్చేసింది. అది జరిగి పదేళ్లయింది. మళ్లీ కొత్తవాటిని మరింత సమర్థంగా హమాస్‌ తయారు చేసుకుంది. 

5  ప్రజలే కవచంగా..

ఇజ్రాయెల్‌ సైనిక సామర్థ్యం సంగతి ఎలా ఉన్నా... 10 లక్షల మందికి పైగా పౌరులు 24 గంటల్లో ఉత్తర గాజాను ఖాళీ చేయటం కష్టసాధ్యం!  సాధారణ ప్రజల మాటున ఉగ్రవాదులు కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. గాజాలో ప్రస్తుతం 50 వేల మంది గర్భిణులు ఉన్నట్లు ఐరాస చెబుతోంది. ప్రజలెవరూ గాజాను వీడి వెళ్లవద్దని హమాస్‌ పిలుపునిచ్చింది. వారికి తాము అండగా నిలబడతామని భరోసా ఇచ్చే క్రమంలో ఈ ప్రకటనేమీ చేయటం లేదు. ఇజ్రాయెల్‌ దాడి తీవ్రమైతే ప్రజలే తమ రక్షణ కవచంగా ఉపయోగపడతారనే ఎత్తుగడ ఇందులో దాగుంది.


బయటి నుంచి..

గాజాపై ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌కు దిగితే.. లెబనాన్‌, సిరియా, ఇరాన్‌లోని హమాస్‌ అనుకూల దళాలు బయటి నుంచి ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వీళ్లంతా ఒకేసారి దాడి చేస్తే అన్నివైపుల నుంచీ ఇజ్రాయెల్‌ సైన్యంపై ఒత్తిడి పెరుగుతుంది. మరో ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా.. లెబనాన్‌ సరిహద్దుల్లోంచి ఇప్పటికే ఇజ్రాయెల్‌పై అనధికారికంగా దాడులు చేస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌ చేపడితే.. హిజ్‌బొల్లా హమాస్‌కు తన మద్దతును మరింత పెంచే అవకాశం ఉంది.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని