Jaishankar: ఐరాస మాకు చెప్పాల్సిన అవసరం లేదు: జైశంకర్‌

Jaishankar: భారత్‌లో ఎన్నికలపై ఇటీవల ఐరాస ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ తోసిపుచ్చారు.

Published : 05 Apr 2024 08:05 IST

తిరువనంతపురం: భారత్‌లో ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి ఇటీవల చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) గురువారం తోసిపుచ్చారు. దేశంలో ఎన్నికలు ‘‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా’’ జరగాలని ఆ అంతర్జాతీయ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదని దీటుగా బదులిచ్చారు. భారత్‌లో ప్రజల ‘‘రాజకీయ, పౌర హక్కుల’’కు రక్షణ ఉంటుందని.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని తాము ఆశిస్తున్నామని ఇటీవల ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జైశంకర్‌ పైవిధంగా అన్నారు.

భాజపా తరఫున తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన మంత్రివర్గ సహచరుడు రాజీవ్ చంద్రశేఖర్ కోసం ప్రచారం చేసేందుకు జైశంకర్‌ (S Jaishankar) గురువారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించారు. అపోహలు, అసత్యాలతో కూడిన ప్రశ్నకు బదులిస్తూ భారత ఎన్నికలపై ఐరాస ప్రతినిధి స్పందించారని వ్యాఖ్యానించారు. ‘‘మన ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగాలని ఐరాస చెప్పాల్సిన అవసరం లేదు. మాకు భారతదేశ ప్రజలు ఉన్నారు. వారే ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తారు. దాని గురించి ఎవరూ చింతించాల్సిన పనిలేదు’’ అని జైశంకర్‌ అన్నారు.

కచ్చతీవుపై నాటి చర్చల్లో డీఎంకే కూడా భాగమే

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వంటి పరిణామాలపై ఇటీవల ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ స్పందించారు. ‘‘భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న ఏ దేశంలోనైనా ప్రజల రాజకీయ, పౌర హక్కుల రక్షణ ఉంటుందని.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పాక్షిక వాతావరణంలో ఓటు వేయగలరని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. అంతకుముందు జర్మనీ, అమెరికా సైతం కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ ఖాతాల వ్యవహారంపై స్పందించాయి. ఒక సార్వభౌమ దేశ అంతర్గత వ్యవహారాలపై జోక్యం తగదంటూ భారత్‌ దీటుగానే బదులిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని