కచ్చతీవుపై నాటి చర్చల్లో డీఎంకే కూడా భాగమే

కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించేలా అయిదు దశాబ్దాల కిందట అప్పటి భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంలో డీఎంకే పార్టీ పాత్ర కూడా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆరోపించారు.

Published : 05 Apr 2024 05:16 IST

ఆ దీవి అప్పగింతకు అంతర్గతంగా మద్దతిచ్చింది: జైశంకర్‌

తిరువనంతపురం: కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించేలా అయిదు దశాబ్దాల కిందట అప్పటి భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంలో డీఎంకే పార్టీ పాత్ర కూడా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆరోపించారు. శ్రీలంకతో నాడు కేంద్ర సర్కారు జరిపిన చర్చల్లో ఆ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో గురువారం ఆయన విలేకర్లతో పలు అంశాలపై మాట్లాడారు. కచ్చతీవుకు సంబంధించి ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగుతుండటంపై స్పందిస్తూ.. 1973 నుంచి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సర్కారుతో చర్చలు జరిపిందని తెలిపారు. అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధితోనూ వ్యక్తిగతంగా మాట్లాడిందని చెప్పారు. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించడాన్ని తాము బహిరంగంగా సమర్థించలేమని, అయితే అంతర్గతంగా మాత్రం ఆ విషయంలో కేంద్రానికి మద్దతిస్తామని డీఎంకే అప్పట్లో తెలిపినట్లు జైశంకర్‌ ఆరోపించారు. అలాంటి పార్టీ ప్రస్తుతం తమిళ జాలర్ల హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు- చైనా, పాకిస్థాన్‌ మినహా ఇతర పొరుగు దేశాలన్నింటితోనూ భారత్‌ సంబంధాలు గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా మెరుగయ్యాయని జైశంకర్‌ అన్నారు. భాజపా పాలనలో చైనాకు భారత్‌ భూభాగాలను కోల్పోయిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. 1962లో మన దేశం 38 వేల కిలోమీటర్ల భూమిని కోల్పోయిందని చెప్పారు. 2000 సంవత్సరం తర్వాత భూభాగాన్ని కోల్పోయామని చెప్పడంలో మాత్రం వాస్తవం లేదని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని