Mohamed Muizzu: తీరు మారని ముయిజ్జు: ఇటు భారత్‌లో పర్యటన.. అటు ఒప్పందాలపై దర్యాప్తు

చైనా అనుకూలుడిగా పేరుపొందిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu).. మరోసారి భారత్‌పై తన వ్యతిరేకతను ప్రదర్శించారు. 

Updated : 11 Jun 2024 14:03 IST

దిల్లీ: మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) మాల్దీవులకు అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గరి నుంచి మనదేశంతో దౌత్యపరమైన సంబంధాల్లో ఒడుదొడుకులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో కొత్త సర్కార్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం దిల్లీ వచ్చిన ఆయన మన నేతలతో కరచాలనాలు చేశారు. అభినందన సందేశాలు పంపారు. ఇక్కడ ఆయన పర్యటిస్తోన్న సమయంలో.. మాల్దీవుల పార్లమెంట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమ గత ప్రభుత్వం భారత్‌ చేసుకున్న ఒప్పందాలను సమీక్షించే ఉద్దేశంతో తీసుకువచ్చారు. ఇది రెండు దేశాల సంబంధాలను మరింత దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

హైడ్రోగ్రాఫిక్‌ సర్వే, ఉతురు థిలా ఫాల్హు డాక్‌యార్డ్ ప్రాజెక్ట్‌ నిర్మాణం, మానవతాసాయం - సహాయక చర్యల నిమిత్తం మాల్దీవుల సైన్యానికి ఇచ్చిన డార్నియర్ విమానం వంటి వాటి కోసం ఇరుదేశాల మధ్య గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ పరిశీలించనుంది. ఈ ఒప్పందాలు మాల్దీవుల సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తాయని ఆరోపించడం గమనార్హం. మరోసారి విదేశాంగమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌. జై శంకర్‌ను దీనిపై పాత్రికేయులు ప్రశ్నించారు. ‘‘ముయిజ్జుతో నేను సమావేశమయ్యాను. ఆయన ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. విదేశాంగ విధానంలో చర్చల ద్వారా ఈ అంశాలపై ముందుకు వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.

ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి: హమాస్‌ హెచ్చరిక!

చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు.. అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుంచి భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇదివరకటి అధ్యక్షుల్లా భారత్‌లో కాకుండా.. తన తొలి పర్యటన తుర్కియే, ఆ తర్వాత చైనాలో జరిపారు. ఇంకోపక్క భారత్‌ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించారు. దేశంలో చేపడుతున్న పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి మధ్య.. భారత్‌తో సన్నిహిత సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా ప్రధాని మోదీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశలో సాగుతున్నాయనే సందేశం తన పర్యటన ద్వారా నిరూపితం అవుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చూస్తుంటే.. ఆయన రెండు నాల్కల ధోరణి తేటతెల్లం అవుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని