Japan: ఉత్తర కొరియాపై నిఘా కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించిన జపాన్‌

ఉత్తర కొరియా (North Korea)పై నిఘాను జపాన్‌  (Japan) మరింత బలోపేతం చేసింది. ఇందుకోసం తాజాగా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 

Updated : 12 Jan 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని నెలలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న  ఉత్తర కొరియాపై నిఘా వేసేందుకు జపాన్‌ (Japan) చర్యలు చేపట్టింది. శుక్రవారం దీనిలో భాగంగా ఒక నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర కొరియా దళాల కదలికలను తెలుసుకోనుంది. వాతావరణంలో ముప్పులను ముందస్తుగా గ్రహించి అప్రమత్తం చేస్తుంది. ది హెచ్‌2ఏ రాకెట్‌ సాయంతో మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తనేగషిమా స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించింది. 

ఈ ఉపగ్రహం స్పష్టమైన చిత్రాలను తీయగలదు. 1988లో ఉత్తరకొరియా క్షిపణి జపాన్‌ గగనతలం పైనుంచి ప్రయాణించింది. నాటి నుంచి సొంతంగా నిఘా ఉపగ్రహ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకొంది. 10 ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. క్షిపణి ప్రయోగాలను ఈ నెట్‌వర్క్‌ సాయంతో వేగంగా గుర్తించే అవకాశం జపాన్‌కు లభిస్తుంది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాలను మరింత వేగవంతం చేసేందుకు హెచ్‌3 రాకెట్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది.   

హౌతీలపై అమెరికా తొలి ప్రతీకార దాడి

2022లో జపాన్‌లో ఫుమియో కిషిద ప్రభుత్వం సరికొత్త నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటజీని సిద్ధం చేసింది. దీని ప్రకారం అమెరికా నుంచి కొనుగోలు చేసిన టొమహాక్‌ సహా ఇతర క్రూజ్‌ క్షిపణలను మోహరించనుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి అనుసరిస్తున్న ఆత్మరక్షణ విధానంలో మార్పులు తెచ్చింది. చైనా, ఉత్తరకొరియా నుంచి ముప్పు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. గత డిసెంబర్‌లో ఓ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించగా దీని శకలాలు  దక్షిణ కొరియా, జపాన్‌ మధ్యలో పడ్డాయి. దీంతో అప్పట్లో ఇరు దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని