Japan Moon Mission: జాబిల్లిపైకి దూసుకెళ్లిన జపాన్‌ ‘స్లిమ్‌’.. ల్యాండింగ్‌ ఎప్పుడంటే..?

Moon Landing: జాబిల్లిపై అడుగుపెట్టేందుకు మరో దేశం సిద్ధమైంది. చంద్రుడిపై ల్యాండింగ్‌ కోసం జపాన్‌ గురువారం కీలక ప్రయోగం చేపట్టింది.

Updated : 07 Sep 2023 12:48 IST

టోక్యో: జాబిల్లి (Moon)పై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్‌ (Japan) కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్‌ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌-రే టెలిస్కోప్‌ (X-ray telescope), లూనార్‌ ల్యాండర్‌ (lunar lander)ను తీసుకొని హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ JAXA ఈ ప్రయోగాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత XRISM (ఎక్స్‌-రే ఇమేజింగ్ అండ్‌ స్పెక్ట్రోస్కోపి మిషన్‌) ఉపగ్రహాన్ని హెచ్‌-2ఏ రాకెట్‌ భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ప్రయోగించారు. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని జపాన్‌ చెబుతోంది.

కార్ల దొంగతనాలను పెంచుతున్న టిక్‌టాక్‌ ఛాలెంజ్‌..!

మూన్‌ స్నైపర్‌ మిషన్‌..

ఇక ఇదే ప్రయోగంలో జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు స్లిమ్‌ (స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌) పేరుతో ఓ తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ను కూడా పంపించారు. ఈ ల్యాండర్‌.. మూడు - నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంటే.. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ స్లిమ్‌ ల్యాండర్‌ (SLIM Lander) జాబిల్లిపై దిగనుందని స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం ‘పిన్‌పాయింట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీ’తో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు అటుఇటూగా దిగుతుంటాయి. కానీ, నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్‌ అయ్యేట్లు దీనిని డిజైన్‌ చేశారు.

ఇటీవలే భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతంగా జాబిల్లిపై కాలుమోపిన విషయం తెలిసిందే. చంద్రుడిపై ఇప్పటి వరకు నాలుగు దేశాలే (అమెరికా, రష్యా, చైనా, భారత్‌) అడుగుపెట్టగా.. ఇప్పుడు అనేక దేశాలు చందమామ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇస్రో అభినందనలు..

జాబిల్లిపైకి స్లిమ్‌ ల్యాండర్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై జపాన్‌కు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) అభినందనలు తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కమ్యూనిటీలో మరో దేశం విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపాలని ఆకాంక్షించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని