New York: కార్ల దొంగతనాలను పెంచుతున్న టిక్‌టాక్‌ ఛాలెంజ్‌..!

టిక్‌టాక్‌ వీడియోలు ఇప్పుడు న్యూయార్క్‌ పోలీసులకు సవాలు విసురుతున్నాయి. వీటి కారణంగా నగరంలో కార్ల దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. 

Published : 07 Sep 2023 10:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిగ్గజ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌(TikTok)లో ఛాలెంజ్‌లు, వీడియోలు కార్ల దొంగతనాలను గణనీయంగా పెంచుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా(USA)లోని న్యూయార్క్‌ (New York) పోలీసులు వెల్లడించారు. ఆ నగరంలో ఇటీవల కాలంలో కార్ల చోరీలు బాగా పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బు కోసం కార్లను దొంగిలించేవారు.. కానీ, ఇటీవల సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లో భాగంగా చేస్తున్నారు. కొంత కాలంగా టిక్‌టాక్‌ ఛాలెంజ్‌లో భాగంగా యువత కియా, హ్యుందాయ్‌ కార్లను దొంగిలించి జాయ్‌రైడ్‌లకు వెళుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

ఫలితంగా నగరంలో ఈ ఏడాది కార్ల దొంగతనాలు 19శాతం పెరిగాయి. ‘‘ఇటీవల కాలంలో వాహన అపహరణలు డబల్‌ డిజిట్‌లో పెరిగాయి.. దీనిని ఏమాత్రం సహించం’’ అని నగర పోలీస్‌ కమిషనర్‌ ఎడ్వర్డ్‌ కాబాన్‌ తెలిపారు. నగరంలోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో ఈ ఏడాది 10,600 కారు దొంగతనాలు జరిగాయి.. గతేడాది ఈ సంఖ్య 9,000గా ఉంది. ఒక్క ఆగస్టులోనే ఇవి 25శాతం పెరిగాయి.   

గ్రీన్‌కార్డు ‘జీవిత కాలం’ లేటు

పోలీసుల కథనం ప్రకారం టిక్‌టాక్‌లో కియా, హ్యుందాయ్‌లోని కొన్ని మోడళ్ల కార్లను ఎలా దొంగిలించాలో సవివరంగా చూపిస్తున్నారు. తాళం లేకుండా కారును ఎలా స్టార్ట్‌ చేయాలి వంటి వివరాలను అందిస్తున్నారు. నగరంలో దొంగతనానికి గురైన కార్లలో ఐదో వంతు ఈ మోడళ్లే ఉంటున్నాయి. ఈ దొంగతనాలకు పాల్పడి అరెస్టైన వారిలో సగం మంది 18 ఏళ్లలోపు యువతే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని