Great Kanto: లక్షమందిని బలిగొన్న భూకంపానికి వందేళ్లు..!

జపాన్‌లో లక్షకుపైగా పౌరులను బలిగొన్న ‘గ్రేట్‌ కాంటో భూకంపాని’కి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్‌ నిర్వహించారు.

Published : 01 Sep 2023 16:53 IST

టోక్యో: జపాన్‌ (Japan) చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ‘గ్రేట్‌ కాంటో భూకంపాని’కి (Great Kanto Earthquake) వందేళ్లు పూర్తయ్యాయి. 1923 సెప్టెంబరు 1న దేశ రాజధాని టోక్యోతోపాటు పరిసర ప్రాంతాలను 7.9 తీవ్రతతో ఓ భారీ భూకంపం కుదిపేసింది. ఈ విపత్తులో లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య గరిష్ఠంగా 1.40 లక్షల వరకూ ఉంటుందనే వాదనలూ ఉన్నాయి. లక్షల సంఖ్యలో నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున చెలరేగిన మంటలకు సుడిగాలులు తోడవడంతో.. ప్రాణ నష్టం భారీగా పెరిగింది. ఈ ప్రకృతి విపత్తుకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు, మాక్‌డ్రిల్స్‌ నిర్వహించారు.

సెప్టెంబరు 1ని జపాన్‌ ప్రభుత్వం ‘విపత్తు నివారణ దినం’గా నిర్వహిస్తోంది. భూకంపాలు, సునామీ, టైఫూన్‌ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందించాల్సిన తీరుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం టోక్యోలో 7.3 తీవ్రతతో ఓ భూకంపం వచ్చినట్లు కల్పిత సన్నివేశాన్ని సృష్టించారు. వెంటనే చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చిస్తున్నట్లు.. జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా, ఇతర మంత్రులు ఓ నమూనా సమావేశాన్ని నిర్వహించారు. భూకంపాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునే నిర్మాణాల విషయంలో ‘గ్రేట్‌ కాంటో’ విపత్తు ఒక పాఠం నేర్పిందని చీఫ్ కేబినెట్‌ సెక్రెటరీ హిరోకాజు మట్సునో అన్నారు.

రష్యా లూనా-25 కూలిపోయిన చోట భారీ గొయ్యి..

ఇదిలా ఉండగా.. 1923లో గ్రేట్‌ కాంటో భూకంపం అనంతరం స్థానికంగా ‘కాంటో ఊచకోత’ ప్రారంభమైంది. విపత్కర పరిస్థితులను అదనుగా తీసుకున్న కొరియన్లు.. స్థానికంగా బావుల్లోని నీటిని విషతుల్యం చేశారని, నగరాలపై దాడికి యత్నిస్తున్నారని పుకార్లు వచ్చాయి. అప్పటికే కొరియన్లపై వ్యతిరేకత ఉండటంతో.. ఒక్కసారిగా వారిపై హింసాత్మక దాడులు మొదలయ్యాయి. ఈ మారణకాండలో దాదాపు ఆరువేల మంది మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే, జపాన్‌ ప్రభుత్వం ఈ లెక్కల్ని తక్కువ చేసి చూపిందన్న ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని