Nasa: రష్యా లూనా-25 కూలిపోయిన చోట భారీ గొయ్యి.. ఫొటోలు విడుదల చేసిన నాసా

రష్యా ప్రయోగించిన లూనా-25 కూలిపోయిన చోటును నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. అక్కడ భారీ గొయ్యి ఏర్పడినట్లు అర్థమవుతోంది.  

Published : 01 Sep 2023 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చంద్రుడిపై పరిశోధనల కోసం దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా ప్రయోగించిన లూనా-25 (Luna-25) మిషన్‌ కూలిపోయిన చోట భారీ గొయ్యి ఏర్పడిందని నాసా (Nasa) వెల్లడించింది. గత నెల రష్యా లూనా -25ను ప్రయోగించింది. కానీ, ఆగస్టు 21న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే యత్నంలో భాగంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తులోనే విఫలమై కూలిపోయింది. అది కూలిన చోట దాదాపు 10 మీటర్ల వెడల్పయిన గొయ్యి పడింది.

అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (NASA)కు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఈ చిత్రాలను తీసింది. ‘‘కొత్తగా ఏర్పడిన బిలం సుమారు 10 మీటర్ల వెడల్పు ఉంది. ఇది లూనా-25 ల్యాండ్‌ అవడానికి నిర్దేశించిన ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంది. ఆ మిషన్‌ కూలడం వల్ల ఏర్పడి ఉండవచ్చు’’ అని నాసా పేర్కొంది. లూనా 25 ప్రాజెక్టు విఫలం కావడంతో రష్యా దీనిపై విచారణ జరిపేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

కౌంట్‌డౌన్‌ మొదలు.. రేపే నింగిలోకి ‘ఆదిత్య ఎల్‌-1’

లూనా-25ని గత నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. దాదాపు పదిరోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్‌.. కూలిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా చంద్రుడి ఫొటోలను పంపించింది. మరోవైపు భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3 విజయవంతంగా సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని