Kim Jong Un: కిమ్‌ కూర్చొని మాట్లాడుకుందాం.. చర్చలకు జపాన్‌ ప్రతిపాదన

జపాన్‌ - ఉత్తర కొరియాల మధ్య త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి ప్రకటించారు. 

Published : 25 Mar 2024 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  బద్ధ శత్రువులైన ఉత్తరకొరియా(North Korea), జపాన్‌ (Japan)ల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈవిషయాన్ని ప్యాంగ్‌యాంగ్‌ పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) సోదరి కిమ్‌ యో జోంగ్‌ సోమవారం వెల్లడించారు. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా     తన సోదరుడితో సమావేశం కోసం అభ్యర్థించారని ఆమె పేర్కొన్నారు. టోక్యో విధానాల్లో మార్పు లేకుండా ఏ సమావేశమైనా సాధ్యం కాదని తెలిపారు.

‘‘వీలైనంత త్వరలో డీపీఆర్‌కే స్టేట్‌ అఫైర్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌(కిమ్‌)తో భేటీ కావాలని ఇటీవల కిషిదా అడిగారు. దీనిలో ఇరుదేశాల సంబంధాలు కొత్త అధ్యాయం ప్రారంభించడంలో జపాన్‌ రాజకీయ నిర్ణయమే కీలక పాత్ర పోషించనుంది. ఆ దేశం ఇంకా అపహరణల అంశం పైనే పట్టుబడితే మాత్రం దానికి ఎటువంటి పరిష్కారం లేదు. ఆయన కోరుకున్నారనో.. నిర్ణయించుకున్నారనో భేటీ జరగదు. ఈ ప్రాంతంలో సుస్థిరతను టోక్యో నిజంగా కోరుకుంటేనే సాధ్యమవుతుంది’’ అని యో జోంగ్‌ పేర్కొన్నారు. గత నెల ఆమె మాట్లాడుతూ జపాన్‌ నాయకులను తమ దేశ పర్యటనకు ఆహ్వానించే అవకాశం ఉందని  సూచనప్రాయంగా తెలిపారు.  

ఈ ప్రకటనపై నేడు జపాన్‌ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. తనకు కేసీఎన్‌ఏ సంస్థ రిపోర్టుల గురించి తెలియదన్నారు. ఆ చర్చలకు సంబంధించిన అంశాలపై బహిరంగంగా మాట్లాడనని తెలిపారు. ఉత్తరకొరియాతో చర్చలు కీలకమని పేర్కొన్నారు. మరోవైపు అపహరణల అంశం వంటి వాటిల్లో ఉన్నత స్థాయి చర్చలు జరిపి పరిష్కారం కనుగొనటం చాలా ముఖ్యమని ఆయన ఇటీవల పార్లమెంట్‌లో కూడా పేర్కొన్నారు. 

ఉత్తరకొరియా-జపాన్‌ మధ్య వైరం 1910 నుంచి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. టోక్యో దళాలు కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకొని అరాచకం సృష్టించడం దీనికి ప్రధాన కారణం. ఆ తర్వాత ఉత్తరకొరియా 1970, 80ల్లో కొందరు ఏజెంట్లను పంపి 13 మంది జపాన్‌ వాసులను కిడ్నాప్‌ చేయించింది. వీరితో తమ గూఢచారులకు జపాన్‌ భాష, ఆచారాల్లో శిక్షణ ఇప్పించాలని భావించింది. ఈ విషయాన్ని 2002లో ఉ.కొరియా అంగీకరించింది.

పీవోకే భారత్‌లో విలీనమవుతుంది

అదే ఏడాది అప్పటి జపాన్‌ ప్రధాని కోయిజుమీ ప్యాంగ్‌యాంగ్‌ పర్యటనకు వెళ్లారు. ఈసందర్భంగా ఇరుదేశాల సంబంధాలు సాధారణ స్థితికి తీసుకొచ్చే యత్నాలు చేశారు. ఉ.కొరియాకు ఆర్థిక సాయం ఆఫర్‌ చేశారు. ఆ సమయంలో బందీల్లోని ఐదుగురు జపాన్‌ వాసులను వదిలిపెట్టారు. ఆ తర్వాత ఇరు దేశాల సంబంధాలు తిరిగి దెబ్బతిన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు