పీవోకే భారత్‌లో విలీనమవుతుంది

భారత్‌లో విలీనం కావాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Updated : 25 Mar 2024 05:48 IST

విశ్వాసం వ్యక్తం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

దిల్లీ, లేహ్‌: భారత్‌లో విలీనం కావాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. ‘కశ్మీర్‌ను వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించి వాళ్లు ఆందోళన చెందాలి. అక్కడ దాడి చేసి ఆక్రమించుకునే అవసరం మనకు ఉండదని ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. భారత్‌లో విలీనం కావాలని పీవోకే ప్రజలే స్వయంగా డిమాండు చేస్తున్నారు’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సైనికులతో కలిసి హోలీ వేడుకలు

హోలీ సందర్భంగా లద్ధాఖ్‌లోని లేహ్‌ సైనిక స్థావరాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్‌ సిబ్బందితో మాట్లాడారు. ‘‘దిల్లీ మన దేశ రాజధాని. ముంబయి మన ఆర్థిక రాజధాని. వీటి మాదిరిగానే లద్ధాఖ్‌ మన శౌర్యానికి రాజధాని’’ అని పేర్కొన్నారు. హోలీ పండుగ కోసం ఇక్కడికి రావడం తన జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో రాజ్‌నాథ్‌ హోలీ చేసుకోవాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన తన పర్యటనను కుదించుకుని లేహ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌ వెంట ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌పాండే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని