మాకూ వేధింపు కాల్స్‌ వస్తున్నాయి: జపాన్‌, చైనా పరస్పర ఆరోపణలు

ప్రస్తుతం జపాన్‌(Japan), చైనా(China) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జపాన్‌ అణువ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలే ప్రక్రియను ప్రారంభించడమే అందుకు కారణం. 

Published : 29 Aug 2023 18:06 IST

టోక్యో: జపాన్‌(Japan) అణు జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టింది. దీనిపై చైనా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది స్వార్థపూరిత చర్య అంటూ డ్రాగన్‌ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సమయంలో తమకు చైనా నుంచి వేధింపు కాల్స్‌ వస్తున్నాయని జపాన్‌ ఆరోపిస్తుండగా.. తమకు కూడా జపాన్‌ నుంచి  ఆ తరహా కాల్సే వస్తున్నాయని చైనా బదులిస్తోంది.  

పాఠశాలపై గుడ్లతో దాడి.. వేధింపు కాల్స్..! 

అణుజలాల విడుదల ప్రక్రియ ప్రారంభం కాగానే జపాన్‌లోని వ్యాపార, ఇతర సంస్థలకు చైనా కంట్రీకోడ్‌తో వేధింపు కాల్స్ వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న వీడియోల్లో చైనాకు చెందిన కాలర్స్‌ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. అణు వ్యర్థాలతో నిండిన నీటిని ఎందుకు మహా సముద్రంలో వదులుతున్నారంటూ ఫోన్‌ చేసి కేకలు వేస్తున్నారు. ఫుకుషిమా మేయర్‌ హిరోషి కొహటా మాట్లాడుతూ.. రెండు రోజుల్లో తనకు రెండు వందల కాల్స్ వచ్చినట్లు చెప్పారు. పాఠశాలలు, రెస్టారెంట్లకు ఈ తరహా ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. చైనాలోని జపాన్‌ సంస్థలకు కూడా వేధింపులు ఎదురవుతున్నాయి. అలాగే చైనాలోని జపాన్‌ పాఠశాలపై రాళ్లు, గుడ్ల దాడులు జరిగాయి. ఈ పరిణామాలతో చైనాలోని జపాన్‌ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

ఈ కాల్స్‌పై చైనా అంబాసిడర్‌కు జపాన్‌ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కాకుండా, అణుజలాల విడుదలపై తప్పుడు సమాచార వ్యాప్తి జరగకుండా నిరోధించాలని కోరింది. చైనాలోని జపాన్‌ ప్రజలు, దౌత్యవేత్తల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరింది. 

యూకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో సమస్య.. వందల విమానాలు రద్దు..!

దీనిపై చైనా స్పందిస్తూ.. మరోసారి అణుజలాల విడుదలను ఖండించింది. ఈ చర్యతో మానవాళికి, సముద్ర జలాల్లోని జీవరాశులపై పెను ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించింది. అలాగే తప్పుడు సమాచార వ్యాప్తి జరుగుతుందన్న వ్యాఖ్యను తోసిపుచ్చింది. తమకు కూడా జపాన్‌ నంబర్స్‌ నుంచి వేధింపు కాల్స్ వస్తున్నాయని బదులిచ్చింది.

ట్రీటియం స్థాయుల్ని తగ్గించి..

ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), జపాన్‌ ప్రభుత్వం, పలువురు శాస్త్రవేత్తలు ఆ అణుజలాలు సురక్షితమైనవేనని చెప్తున్నారు. ఆ నీటిని ఫిల్టర్ చేసి, ఒక్క ట్రీటియం మినహా మిగతా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్‌ను తొలగించినట్లు వెల్లడించారు. ట్రీటియంను వేరు చేయడం వీలుకాకపోవడంతో.. దాని స్థాయిలను ఐఏఈఏ విధించిన పరిమితి దిగువకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. 

ఇటీవల పుకుషిమా ప్లాంట్‌ దగ్గర్లోని సముద్ర జలాలపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి రేడియో యాక్టివిటీని గుర్తించలేదని జపాన్‌ పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రీటియం సాంద్రత గుర్తించలేని స్థాయి కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అక్కడ పట్టిన చేపల్లో కూడా ఎలాంటి తేడాను గుర్తించలేదట. అలాగే జవాబుదారీ కోసం రానున్న మూడు నెలలు ప్రతివారం ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించనున్నట్లు చెప్పింది. అయితే ఈ ట్రీటియం చేపల జీవరాశిలో క్షీణతకు దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. జపాన్ ఇచ్చిన సమాచారంతో తాము ఏకీభవించలేకపోతున్నామని గత ఏడాది చివర్లో అమెరికా స్పందించింది. 

జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రంలో 2011లో ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 134 మిలియన్‌ టన్నుల వ్యర్థ జలాలు పేరుకుపోయాయి. సుమారు 1000 ట్యాంకుల్లో ఇది నిల్వ ఉంది. అవి నిండిపోవడంతో జపాన్‌ వాటిని విడుదల చేయడం ప్రారంభించింది. గత గురువారం నుంచి జపాన్‌ అణు వ్యర్థ జలాలను సముద్రంలోకి వదలడం ప్రారంభించింది. కొన్ని ఏళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని