Japan: పసిఫిక్‌లో టెన్షన్‌.. మరో 48 గంటల్లో సముద్రంలోకి అణు జలాలు..!

ఫుకుషిమాలో నిల్వ చేసిన అణుధార్మిక జలాలను మరో 48 గంటల్లో జపాన్‌ పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టనుంది. దీనిపై చైనా, దక్షిణకొరియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Updated : 22 Aug 2023 18:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌(Japan)లో సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా(Fukushima) అణు రియాక్టర్‌లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను మరో 48 గంటల్లో పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టనున్నారు. ఈ విషయాన్ని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే జపాన్‌ నిర్ణయాన్ని చుట్టుపక్కల దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఐరాస పర్యవేక్షక సంస్థ ఐఏఈఏ మాత్రం ఇప్పటికే ఈ ప్లాన్‌కు అనుమతి మంజూరు చేసింది. జపాన్‌ వద్ద శుద్ధి చేసినట్లుగా చెబుతున్న 1.34 మిలియన్‌ టన్నుల అణు జలాలు ఉన్నాయి. అంటే ఇవి 500 ఒలింపిక్‌ సైజు స్విమ్మింగ్‌ పూల్స్‌కు సమానం.

2011 సునామీలో రియాక్టర్‌ దెబ్బతిన్న నాటి నుంచి జపాన్‌ ఈ అణుజలాలను నిల్వచేసి ఉంచింది. కానీ, ఇప్పుడు చోటు సరిపోని పరిస్థితికి చేరుకొంది. దీంతో వీటిని వివిధ దశల్లో శుద్ధి చేసి రానున్న 30 ఏళ్లపాటు నీటిలోకి విడుదల చేయనున్నారు. విడుదల చేసే నీరు, సముద్ర పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే.. ఆగస్టు 24 నుంచి నీటి విడుదలకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఇప్పటికే అధికారులు ప్లాంట్‌ నిర్వాహకులను కోరారు. ఆదివారం జపాన్‌ ప్రధాని ఈ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి విడుదల చేయక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే నీటి విడుదల చేయాల్సిందేనన్నారు. టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) ఈ నీటిని వడగట్టి 60 రకాల రేడియో యాక్టివ్‌ పదార్థాలను తొలిగిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, ఈ నీటిలో ట్రీటియం, కార్బన్‌-14 మూలకాలు ఉంటాయని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

జయమ్ము నిశ్చయమ్మురా!

2011లో సుమారు 9 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ ప్లాంట్‌ను దెబ్బతీసింది. ఒకప్పటి సోవియట్‌లోని చర్నోబిల్‌ తర్వాత ఇదే అతిపెద్ద అణు ప్రమాదం. వెంటనే అధికారులు సుమారు 1.50 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తాజాగా ఈ నీటి విడుదల ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ నీటి కారణంగా ఇక్కడి మత్స్య సంపదకు డిమాండ్‌ పడిపోతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ నీటి బాధితుల్లో ఉన్నాయి. జపాన్‌ ఈ సముద్రాన్ని తన వ్యక్తిగత మురుగుకాల్వగా భావిస్తోందని బీజింగ్‌ తీవ్రంగా విమర్శించింది. దక్షిణ కొరియాలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఫుకుషిమా అణుకేంద్రం సమీపంలోని జలాల నుంచి పట్టిన చేపల దిగుమతిపై ఈ రెండు దేశాలు నిషేధం విధించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని