Japan : మరోసారి పసిఫిక్‌ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్‌

జపాన్‌ (Japan) అణు జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. వచ్చే వారంలో రెండో విడత నీటి విడుదల ఉంటుందని ఆ దేశం ప్రకటించింది. 

Published : 29 Sep 2023 16:44 IST

టోక్యో : వచ్చే వారంలో రెండోవిడత అణు జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేస్తామని జపాన్‌ ప్రకటించింది. ఆగస్టులో ఆ దేశం కొన్ని టన్నుల వ్యర్థాలను కడలిలోకి వదిలింది. ఈ చర్య చైనా, ఇతర దేశాలకు ఆగ్రహం తెప్పించింది. 2011లో జపాన్‌లో సునామీ వచ్చింది. ఆ సమయంలో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో (Fukushima nuclear plant) వ్యర్థాలను నిల్వచేసే రియాక్టర్‌ మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి వ్యర్థ జలాలను ట్యాంకుల్లో భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ నిండిపోవడం శుద్ధి చేసి ఆ జలాలను పసిఫిక్‌ సముద్రంలో కలిపేస్తున్నారు. ఆగస్టులో జపాన్‌ తొలి విడత కింద కొంత నీటిని పసిఫిక్‌ సముద్రంలోకి పంపించింది. ‘తొలి విడతపై తనిఖీలు పూర్తయ్యాయి. అక్టోబరు 5న రెండో విడత అణు జలాల విడుదల ప్రారంభమవుతుందని’ టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) తెలిపింది. 

జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్‌ డిబేట్‌లో నేతల కొట్లాట

జపాన్‌ నిర్ణయాన్ని తొలి నుంచి చైనా వ్యతిరేకిస్తోంది. తొలి విడత అణు జలాలు విడుదల చేస్తున్నట్లు తెలియగానే జపాన్‌ సీ ఫుడ్‌పై చైనా నిషేధం విధించింది. నీటి విడుదల వల్ల ఎలాంటి ముప్పు లేదని టోక్యో చెబుతున్నప్పటికీ బీజింగ్‌ ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. మరో వైపు రష్యా సైతం సీ ఫుడ్‌ నిషేధం అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే, జపాన్‌ పడవలు మోహరించిన ప్రాంతాల్లోనే చైనా పడవలు వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. జపాన్‌లో అమెరికా రాయబారి రహమ్‌ ఇమ్మాన్యుయేల్ జపాన్‌లో చేపల వేటలో నిమగ్నమైన చైనా పడవలుగా పేర్కొంటూ కొన్ని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 

అణుకేంద్రంలో మొత్తం 1.34 మిలియన్‌ టన్నుల వ్యర్థ జలాలున్నాయి. వాటితో 500 ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ నింపేయచ్చు. అందులో ఇప్పటిదాకా 7,800 టన్నుల నీరు మాత్రమే సముద్రంలో కలిసింది. దశల వారీగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఆ తరువాత శిథిలమైన రియాక్టర్‌ నుంచి అత్యంత ప్రమాదకర రేడియోధార్మిక ఇంధనం, ఇతర వ్యర్థాలను తొలగిస్తే ప్లాంటులో మరింత స్థలం అందుబాటులోకి వస్తుందని జపాన్‌ భావిస్తోంది. 

రేడియో ధార్మిక పదార్థాలను వడపోసిన తరువాతే నీటిని సముద్రంలోకి వదిలిపెడుతున్నామని టెప్కో చెబుతోంది. ఆ నీటిలో ట్రీటియం సురక్షిత స్థాయిలో ఉందని, దానికి యూఎన్‌ అటామిక్‌ ఏజెన్సీ సైతం మద్దతిచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. ‘తొలి విడతలో మాదిరిగానే ట్రీటియం స్థాయులను పర్యవేక్షించే ప్రక్రియను కొనసాగిస్తాం. శాస్త్రీయ ఆధారాలను ప్రజలు అర్థం చేసుకునేలా నిరంతరం సమాచారం ఇస్తామని’ టెప్కో అధికారి అకీరా ఒనో వెల్లడించారు. అయితే, జపాన్‌ సముద్రాన్ని మురుగు కాలువలా వినియోగిస్తోందని చైనా మండిపడుతుతోంది. డ్రాగన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సోలమన్‌ దీవుల ప్రధానమంత్రి మనస్సే సొగవారే సైతం గత వారం ఐక్యరాజ్యసమితి ఎదుట ఇలాంటి ఆరోపణలే చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని