Joe Biden: చైనా ఓ ఆర్థిక టైమ్‌బాంబ్‌..: జోబైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు

చైనా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వ్యాఖ్యానించారు. అది ఏ క్షణమైనా పతనం కావచ్చనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలున్నాయి.

Updated : 11 Aug 2023 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జనాభా, ఆర్థిక సమస్యలు చైనా(China)ను పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌ బాంబులా మార్చేశాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పరిస్థితి.. మిగిలిన ప్రపంచాన్ని భయపెడుతోందన్నారు. గురువారం యూటాలోని పార్క్‌సిటీలో విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో వృద్ధి మందగించిందని.. దీనికి తోడు అక్కడ పనిచేసేవారి కంటే  రిటైరైపోయేవారి సంఖ్యే అధికంగా ఉండటం సమస్యాత్మకంగా మారిందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ‘‘అత్యధిక నిరుద్యోగ రేటు కొనసాగుతోంది. దీంతో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. సాధారణంగా చెడ్డవారికి సమస్యలుంటే.. వారు మరింత చెడు పనులే చేస్తారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మునకకు సిద్ధంగా మరో చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజ సంస్థ..!

బీజింగ్‌ చర్యలను వాషింగ్టన్‌ జాగ్రత్తగా గమనిస్తోందని.. దాంతో పోరును కోరుకోవడంలేదని బైడెన్‌ వెల్లడించారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టును ఆయన ఓ రుణ ఉచ్చుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కింద రుణం పొందాలనుకునే దేశాలు చైనా షరతులను కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందన్నారు.

అమెరికా సంస్థలు చైనాలో టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు విధిస్తూ ఈ వారం బైడెన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చైనాతో సంబంధాలను కొంత మెరుగుపర్చుకొనేందుకు విఫల యత్నం చేసిన తర్వాతే ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.

ఇప్పటి వరకు చైనాపై జోబైడెన్‌ చేసిన అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు ఇవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడు, ఆ దేశ మోసపూరిత ఆర్థిక విధానాలపై బైడెన్‌ కఠిన వైఖరి తీసుకొన్నారని ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఇప్పటికే చైనా ఎగుమతులు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులను అమెరికా నిలిపివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని