China: మునకకు సిద్ధంగా మరో చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజ సంస్థ..!

చైనా ప్రతి ద్రవ్యోల్బణంలో అడుపెట్టడం చాలా సంస్థలకు శాపంగా మారింది. తాజాగా ఓ భారీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కేవలం ఆరు నెలల్లోనే రూ.56 వేల కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

Updated : 11 Aug 2023 10:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో స్థిరాస్తి రంగం ఏమాత్రం కోలుకోలేదు. ఇప్పటికే ఆ దేశ దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘ఎవర్‌గ్రాండే’ దాదాపు రూ.6 లక్షల కోట్లకుపైగా నష్టాలను ప్రకటించగా.. తాజాగా మరో దిగ్గజ ప్రాపర్టీ డెవలపర్‌ ‘కంట్రీ గార్డెన్‌’ తొలి ఆరు నెలల్లో 7.6 బిలియన్‌ డాలర్ల (రూ. 57వేల కోట్లు) నష్టాన్ని చూడవచ్చని ప్రకటించింది. చైనాలో అంతర్గతంగా వేళ్లూనుకొన్న ఆర్థిక కష్టాలను కంట్రీ గార్డెన్‌ పరిస్థితి చెబుతోంది.

జీ- సోనీ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే హాంకాంగ్‌ మార్కెట్లో కంట్రీ గార్డెన్‌ షేర్ల ధరలు 10 శాతం పతనం అయ్యాయి. వాస్తవానికి ఈ జూన్‌ 30తో ముగిసిన తొలి ఆరునెలల కాలానికి  నష్టం రాగా.. గతేడాది ఇదే కాలంలో సంస్థ 265 మిలియన్‌ డాలర్ల లాభంలో ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీని నష్టాల బారి నుంచి బయటపడేయటానికి ఛైర్మన్‌ యాంగ్‌ హుయాన్‌ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు గురువారం ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఈ సంస్థ రేటింగ్‌ను తగ్గించింది. నగదు కోసం కంట్రీగార్డెన్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది.

ఈ సంస్థ డాలర్‌ బాండ్ల చెల్లింపుల్లో కూడా సమస్యలను ఎదుర్కొంటోంది. గతేడాది చివరి నాటికి దాదాపు 199 బిలియన్‌ డాలర్ల రుణభారం ఉంది. ఈ సంస్థ చైనాలోని చిన్న పట్టణాల్లో దాదాపు 3,000 హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. దీని కింద 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

చైనాలో ప్రతి ద్ర్యోల్బణం కారణంగా తాజాగా ధరల పతనం కొనసాగుతోందని ఇటీవల  ప్రకటించిన సమయంలో ఈ ఫలితాలు వెలువడటం గమనార్హం. ఆ దేశంలో ఎగుమతులు గణనీయంగా పడిపోవడంతో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. దేశ ఎగుమతులు జులైలో 14.5శాతం పడిపోయాయి. దీనికి తోడు కొత్తగా 11.58 మిలియన్ల మంది గ్రాడ్యూయేట్లు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని