లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుండగా.. విలేకరిని అసభ్యంగా తాకి..!

స్పెయిన్‌ (Spain) ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్‌ రుబియాలెస్‌.. ఓ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిని పెదవులపై ముద్దాడిన ఘటన మరవకముందే.. ఆ దేశంలో మరో ఘటన వెలుగుచూసింది. లైవ్‌లో రిపోర్టర్‌తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

Published : 14 Sep 2023 15:49 IST

మాడ్రిడ్‌: లైవ్‌ రిపోర్టింగ్‌ (Live Reporting) చేస్తున్న విలేకరితో ఓ వ్యక్తి లైంగిక వేధింపుల (Sexual Harassment)కు పాల్పడ్డాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ అనుచితంగా ప్రవర్తించాడు. స్పెయిన్‌ (Spain) రాజధాని మాడ్రిడ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే..

మాడ్రిడ్‌లోని ఓ దుకాణంలో ఇటీవల చోరీ జరిగింది. ఆ ఘటనపై రిపోర్టింగ్‌ చేసేందుకు స్థానిక క్యూట్రో ఛానల్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ (Journalist) అక్కడకు వెళ్లారు. దొంగతనం జరిగిన స్టోర్‌ ముందు నిల్చుని తన టీవీ ఛానల్‌కు లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుండగా ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. వెనుక నుంచి ఆమెను అసభ్యంగా తాకి వేధింపులకు పాల్పడ్డాడు.

75% ఉద్యోగులను తొలగిస్తా.. FBIని మూసేస్తా!: వివేక్‌ రామస్వామి

ఆమె వాటిని పట్టించుకోకుండా తన రిపోర్టింగ్‌ కొనసాగించినా.. ఆ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి వెళ్లలేదు. అంతలో ఛానల్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ హోస్ట్‌ దీని గురించి ఆ విలేకరిని అడగ్గా.. అప్పుడు ఆమె ఇబ్బంది పడుతూ జరిగిన విషయం చెప్పారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం తానేమీ చేయలేదంటూ బుకాయించాడు. అంతటితో ఆగకుండా ఆమెను మళ్లీ తాకే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా వ్యతిరేకించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. కాగా.. ఇటీవల స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్‌ రుబియాలెస్‌.. ఓ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిని పెదవులపై ముద్దాడిన ఘటన తీవ్ర వివాదాస్పదమైన వేళ.. ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని