Vivek Ramaswamy: 75% ఉద్యోగులను తొలగిస్తా.. FBIని మూసేస్తా!

2024 ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75శాతం మందిని తొలగిస్తానని, ఎఫ్‌బీఐ (Federal bureau of Investigation) వంటి అనేక సంస్థలను మూసివేస్తానని రిపబ్లికన్‌ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్‌ రామస్వామి ప్రకటించారు.

Updated : 14 Sep 2023 14:39 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి (38).. ప్రైమరీ పోటీలో పలు కీలక ప్రతిపాదనలు చేశారు. 2024 ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వారిలో 75శాతం మందిని తొలగిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎఫ్‌బీఐ (FBI) వంటి అనేక సంస్థలను మూసివేస్తానని అన్నారు. ఓ అమెరికన్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్‌.. విద్యాశాఖ, ఎఫ్‌బీఐ వంటి విభాగాలే తన లక్ష్యమన్నారు.

విద్యాశాఖ, ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్‌, పొగాకు, ఆయుధాలు పేలుడు పదార్థాలు, అణు నియంత్రణ కమిషన్‌, ఐఆర్‌ఎస్‌ (ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌), కామర్స్‌ డిపార్టుమెంట్స్‌ లక్ష్యంగా తాను పనిచేస్తానని వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు. ‘అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే పని మొదలుపెడతాం, ఏడాది చివరి నాటికి 50శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నాం. అయితే, ఈ ఉద్యోగుల్లో 30శాతం మంది వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ పొందనున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని వివేక్‌ రామస్వామి అన్నారు. సంఖ్య పెద్దగా కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రస్తుతమున్న 22లక్షల మంది ఉద్యోగుల్లో 75శాతం మందిని తగ్గించడమే తమ లక్ష్యమని వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు.

రష్యాకు రామస్వామి ఆఫర్‌..!

‘ఈ పని పూర్తిచేయాలంటే.. సలహాదారులు, ఉన్నతాధికారుల్లో పాతుకుపోయిన ఎన్నో అపోహలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదో కంపెనీలో పనిచేయడంతో సమానం. సీఈవోకు చెప్పకుండా హెచ్‌ఆర్‌ విభాగం ఎటువంటి నిబంధనలు రూపొందించదు. ఫెడరల్‌ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా పనిచేస్తుంది. అధ్యక్షులుగా పనిచేసిన రొనాల్డ్‌ రీగన్‌ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ వరకు ఇదే ఆలోచన చేశారు. ఈ క్రమంలో విస్తృత చర్యలు తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు నేను క్రెడిట్‌ ఇస్తాను’ అని వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు.

అమెరికా ఫెడరల్‌ విభాగంలో ప్రస్తుతం 22.5లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో 75శాతం మంది తొలగించడమంటే 16లక్షల మందికి ఉద్వాసన పలకాల్సి వస్తుంది. దాంతో బడ్జెట్‌లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. కానీ, ప్రభుత్వ కీలకమైన కార్యకలాపాలు కూడా మూతపడతాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలతో వివేక్‌ రామస్వామి అనేక మంది మద్దతును చూరగొన్నారు. తర్వాత నిర్వహించిన పోల్‌లో 504 మంది స్పందన తెలియజేయగా.. అందులో 28శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. ఫ్లోరిడా గవర్నర్‌ డీసాంటిస్‌ (27శాతం), మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌(13శాతం), భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ (7శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని