Justin Trudeau: దౌత్యపర ఉద్రిక్తతల వేళ.. కెనడా ప్రధాని ‘నవరాత్రి’ శుభాకాంక్షలు!

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 15 Oct 2023 23:29 IST

ఒటావా: ఖలిస్థాన్‌ అనుకూల ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుతో భారత్‌- కెనడాల మధ్య దౌత్యపర ఉద్రిక్తత (India- Canada Row)లు ఏర్పడిన విషయం తెలిసిందే. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపిస్తూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) దిల్లీతో కయ్యానికి కాలుదువ్వారు. ఇలా భారత్‌తో విభేదాలు నెలకొన్న వేళ.. ట్రూడో తాజాగా హిందువులందరికీ దసరా నవరాత్రుల (Navratri) శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సమాజపు గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వేడుకలు దోహదపడతాయని కెనడీయన్లకు సూచించారు.

‘కెనడాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా నవరాత్రి వేడుకలు చేసుకుంటారు. హిందువులకు అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండగల్లో ఇదీ ఒకటి. స్త్రీ శక్తికి గుర్తుగా మహిషాసురుడిపై దుర్గామాత సాధించిన విజయం.. చెడుపై మంచి సాధించిన గెలుపును గుర్తుచేసుకుంటూ వేడుకలు నిర్వహిస్తారు. హిందూ సమాజపు గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి మరింత తెలుసుకునేందుకు కెనడావాసులకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుంది. కెనడా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలకు హిందువులు అందిస్తోన్న అమూల్యమైన సహకారాన్ని గుర్తించేందుకు వీలుకల్పిస్తుంది. కెనడా బలాల్లో వైవిధ్యం ఒకటి అని ఈ వేడుకలు మనకు గుర్తు చేస్తాయి. ఈ సంవత్సరం నవరాత్రి వేడుకలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ నా కుటుంబం, కెనడా ప్రభుత్వం తరపున నా శుభాకాంక్షలు’ అని కెనడా ప్రధాని ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని