Justin Trudeau: ‘ట్రూడో ఓ అసమర్థ ప్రధాని’.. కెనడా విపక్ష నేత ధ్వజం

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోపై (Justin Trudeau) అక్కడి విపక్ష నేత పియరీ పోలివ్రే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 22 Oct 2023 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దౌత్యవేత్తల సంఖ్య తగ్గింపుపై భారత్‌, కెనడాల మధ్య విభేదాలు (Diplomatic row) కొనసాగుతున్న వేళ.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోపై (Justin Trudeau) అక్కడి విపక్ష నేత పియరీ పోలివ్రే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని ట్రూడో ఓ అసమర్థ ప్రధాని అని విమర్శించిన ఆయన.. విదేశాలతోనూ కెనడా సంబంధాలను ఆయన దెబ్బతీశారని మండిపడ్డారు. ముఖ్యంగా కెనడాలో భారతీయ దౌత్యవేత్తలపై వ్యవహరించిన తీరు, స్థానికంగా పెరుగుతోన్న విద్వేషపూరిత ఘటనలను ఆయన ఖండించారు. నమస్తే రేడియో టొరంటో అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పోలివ్రే ఇలా మాట్లాడారు.

‘ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఆయన పనితీరు లేదు. స్థానికంగా కెనడియన్ల మధ్య విభేదాలు తేవడంతోపాటు విదేశాలతో ఉన్న సంబంధాలను దెబ్బతీశారు. భారత్‌తోపాటు ప్రపంచంలోని ప్రతి కీలక దేశాలతోనూ వివాదం నెలకొంది. ఆయనొక అసమర్థ ప్రధాని. నైపుణ్యం లేని వ్యక్తి’ అని పియరీ పోలివ్రే పేర్కొన్నారు. ‘భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌. కొన్ని విభేదాలు ఉండటం సహజం. వాటికి జవాబుదారీగా నిలవడం మంచిది. కానీ, సత్సంబంధాలు కలిగి ఉండాల్సి ఉంది. నేను ప్రధాని అయిన తర్వాత వీటిని పునరుద్ధరిస్తా’ అని కెనడాలో విపక్ష నేత పియరీ పోలివ్రే పేర్కొన్నారు.

దౌత్యవేత్తల తగ్గింపు వివాదంలో.. కెనడాకు అమెరికా, బ్రిటన్‌ల వత్తాసు

కెనడా విదేశీ విధానంపై విమర్శలు గుప్పించిన పోలివ్రే.. చైనా, అమెరికాల తీరుపైనా మండిపడ్డారు. స్థానికంగా రహస్యంగా పోలీస్‌ స్టేషన్లను తెరుస్తూ కెనడా అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందన్నారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ట్రూడోను డోర్‌ మ్యాట్‌లా చూస్తున్నారని అన్నారు. ఇటీవల ఓ నాజీని పార్లమెంటుకు తీసుకువచ్చి సన్మానించడం గర్హనీయమన్నారు. ఇలా కెనడాతోపాటు ఇక్కడి పౌరులను ప్రతిరోజు అవమానాలకు గురిచేస్తున్న వ్యక్తిని (జస్టిన్‌ ట్రూడో) ప్రధానమంత్రిగా కొనసాగించలేమని పియరీ పోలివ్రే తేల్చిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని