Justin Trudeau: ట్రూడో సార్‌ గుర్తుందా.. ‘మీరు ఇది చదవాలనుకోరు’..!

కెనడాలోని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం చరిత్రను చూసి ఏ మాత్రం పాఠాలు నేర్చుకోలేదు. 2001 వరకు అతిపెద్ద ఉగ్ర దాడిగా నిలిచిన కనిష్క బాంబింగ్‌ కుట్ర ఆ దేశ గడ్డపైనే జరిగింది. నాటి బాధితులను గాలికొదిలేసి.. నిజ్జర్‌ వంటి ఉగ్రవాదులను వెనకేసుకొచ్చే పనిలో మునిగిపోయింది.

Updated : 27 Sep 2023 17:36 IST

తమది చట్టం, అంతర్జాతీయ నిబంధనలు అనుసరించే దేశమని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పదేపదే చెబుతుంటారు. కానీ, అమెరికాలో 9/11 దాడి జరిగే వరకు.. అంతకుముందు అతిపెద్ద ఉగ్రదాడిగా నిలిచిన ఘటన ‘ఎంపరర్‌ కనిష్క’ పేల్చివేత. ఈ కుట్ర కెనడాలోనే పురుడుపోసుకుంది. దీని దర్యాప్తులో కెనడా విపరీతమైన నిర్లక్ష్యం ప్రదర్శించింది. బాధితులు దశాబ్దాలపాటు న్యాయం కోసం ఆక్రోశించాల్సి వచ్చింది. ఈ కేసులో అక్కడి పాలకులు, దర్యాప్తు సంస్థల ద్వంద్వ వైఖరిని.. కెనడా ప్రజాధనంతో నడిచే సీబీసీ పత్రిక జర్నలిస్టు టెర్రీ మిలేవ్స్కి ‘మీరు దీన్ని చదవాలనుకోరు’ అనే కథనంతో 2010లోనే ఎండగట్టారు. ఇక కెనడాలో గ్యాంగ్‌వార్లు సర్వసాధారణం. తాజాగా నిజ్జర్‌ హత్యలో ఆ కోణాన్ని ట్రూడో విస్మరించినట్లు కనిపిస్తోంది.

‘కనిష్క’ కుట్రదారు రిపుదమాన్‌ హత్యకేసులో నిజ్జర్‌ పేరు..

1985లో కనిష్క బాంబింగ్‌ కేసులో కీలక నిందితుడైన రుపుదమాన్‌ సింగ్‌ మాలిక్‌ను గతేడాది జులై 14న గుర్తుతెలియని వ్యక్తులు కెనడాలోని వాంకోవర్‌లో కాల్చి చంపారు. మాలిక్‌ 2005లో కనిష్క బాంబింగ్‌ కేసు నుంచి బయటపడ్డాడు. అతడు భారత్‌ బ్లాక్‌లిస్ట్‌ వ్యక్తుల జాబితాలో కూడా ఉన్నాడు. కానీ, ఆ తర్వాత కొన్నేళ్లకు భారత్‌ ప్రభుత్వంతో రాజీపడ్డాడు. 2019లో న్యూదిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌లను సందర్శించాడు. ప్రధానిని పొగుడుతూ లేఖలు కూడా రాశాడు. రిపుదమాన్‌ హత్య వెనుక ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత నిజ్జర్‌ హస్తం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్‌ అనుకూల స్వరం వినిపించడంతో అతడిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

2001 వరకు అతిపెద్ద ఉగ్రదాడి కనిష్కా పేలుడే..

భారత్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా తొలి బోయింగ్‌ 737-237బీ విమానం (ఎంపరర్‌ కనిష్క)ను.. 1985 జూన్‌ 23న యూకే సమీపంలోని ఐరిష్‌ వద్ద అట్లాంటిక్‌ సముద్రంపై ఉగ్రవాదులు పేల్చివేశారు. ఈ ఘటనలో 329 మంది చనిపోగా.. అందులో నాలుగోవంతు చిన్నారులే. అదే రోజు జపాన్‌లోని నరిట అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాగేజింగ్‌ వద్ద బాంబుపేలి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ కేసుల్లో తల్విందర్‌ సింగ్‌ పర్మార్‌, ఇంద్రజిత్‌ సింగ్‌ రేయాత్‌, మంజిత్‌ సింగ్‌, అజైబ్‌ సింగ్‌ భాగ్రి, రిపుదమాన్‌ సింగ్‌ మాలిక్‌ను ప్రధాన నిందితులుగా గుర్తించారు. భారత్‌లో పోలీసుల హత్యకేసులో తల్విందర్‌ అప్పటికే నిందితుడు.. అతడికి కెనడా ఆశ్రయం ఇచ్చింది.

వీరు ఈ దాడులకు చాలా ముందస్తుగానే పథక రచన చేశారు. ఎయిర్‌ ఇండియా విమానాలు నేలకూలుతాయని పర్మార్‌ బహిరంగ ప్రకటనలు చేశాడు. అతడిపై కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ నిఘా ఉంచింది. అతడి ఫోన్‌ను వైర్‌ట్యాపింగ్‌ చేసి పలు సంభాషణలు రికార్డు చేసింది. దాడికి మూడు వారాల ముందు పర్మార్‌, రేయాత్‌లు వాంకోవర్‌ వద్ద టెస్ట్‌ బ్లాస్ట్‌ నిర్వహించి బాంబులను పరీక్షించడం సీఎస్‌ఐఎస్‌ ఏజెంట్లు స్వయంగా చూశారు. కానీ, నిర్లక్ష్యంగా వదిలేశారు.

చివరికి బాంబులు బ్యాగేజీ రూపంలో కెనడాలోని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల్లోకి చేరాయి. ఈ బ్యాగేజీలకు చెందిన వ్యక్తులు మాత్రం విమానాలు ఎక్కలేదు. పైగా అదే సమయంలో మెటల్‌ డిటెక్టర్‌ వ్యవస్థలు కూడా పనిచేయలేదు. ఇక కెనడా నుంచి జపాన్‌ వెళ్లిన విమానం నుంచి బ్యాగేజీ నరిటలోని మరో విమానంలోకి మారుస్తున్న సమయంలో బాంబు పేలి ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. ఈ బాంబ్‌ టైమర్‌ సెట్టింగ్‌లో హంతకులు తప్పు చేయడంతో ముందే పేలింది. లేకపోతే మరో ఎయిర్‌ ఇండియా విమానం కూడా బలయ్యేది. ఇక కనిష్కలో పెట్టిన బాంబు సమయానికి పేలి 329 మంది ప్రాణాలు బలిగొంది.

రెండు పేలుళ్లలో ఒక్కరికే శిక్ష..

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీఎస్‌ఐఎస్‌ (కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌), ఆర్‌సీఎంపీ (రాయల్‌ కెనేడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌) ఏళ్లపాటు జాప్యం చేశాయి. అనుమానితులను ప్రశ్నించినా.. దర్యాప్తు ముందుకు వెళ్లలేదు. కేవలం రేయాత్‌ వద్ద పేలుడు పదార్థాలున్నాయని 2,000 డాలర్ల ఫైన్‌ విధించింది. ఆ తర్వాత మూడు నెలలకే అతడు కెనడా వదిలి యూకే వెళ్లిపోయాడు. కానీ, జపాన్‌ దర్యాప్తు బృందాలు రేయాత్‌ కెనడాలో టైమర్లు కొన్నట్లు గుర్తించాయి. తర్వాత అతడిని బ్రిటన్‌ నుంచి కెనడాకు రప్పించి విచారించారు. నరిట కేసులో అతడికి 1991లో పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ జంట బాంబుల కేసుల్లో శిక్ష అనుభవించిన వ్యక్తి ఇతడొక్కడే. మరోవైపు పేలుళ్లు జరిగిన 15 ఏళ్లకు 2000 సంవత్సరంలో మాలిక్‌, భాగ్రిలను అరెస్టు చేశారు. కానీ, 2005లో నిర్దోషులుగా వీరు బయటపడగా.. రేయాత్‌కు మరోసారి శిక్ష పడింది.

ఇక కనిష్క బాంబింగ్‌ విచారణ తప్పించుకోవడానికి  తల్విందర్‌ కెనడా వదిలి పాక్‌కు పారిపోయాడు. అక్కడి నుంచి 1992లో భారత్‌లోకి చొరబడి.. పంజాబ్‌ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. భూగోళానికి రెండు వైపులా ఒకే రోజు జరిగిన రెండు బాంబుదాడుల్లో ఒకే ఒక్క దోషిని కెనడా పట్టకోగలిగినట్లైంది.

ఆక్రోశించిన తెలుగు కంఠం..!

కనిష్క దోషులను పట్టుకోకుండా కాలయాపన చేస్తున్న కెనడా ప్రభుత్వంపై తెలుగు కంఠం ఆక్రోశించింది. ఎయిర్ ఇండియా ఘటన 20వ స్మారక దినం ఐర్లాండ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కెనడా నాటి ప్రధాని పాల్‌ మార్టిన్‌, ప్రతిపక్ష నేత స్టీఫెన్‌ హార్పర్‌ హాజరయ్యారు. ఈ సంస్మరణ సభలో కెనడాలో నివసించే తెలుగు డాక్టర్ పద్మినీ తుర్లపాటి మాట్లాడుతూ ‘‘వారిని ఆ విమానం ఎక్కించినందుకు మనల్ని మనం నిందించుకోవాలి’’ అని ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపారు. ఈ బాంబింగ్‌లో పద్మినీ ఇద్దరు కుమారులను కోల్పోయారు. ఆ తర్వాత ఏడాదికి హార్పర్‌ ప్రధాని అయ్యారు. ఆయన జస్టిస్‌ జాన్‌ సీ మేజర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

ఉగ్రవాదుల ఆడియో టేపుల ధ్వంసమా..?

కనిష్క దర్యాప్తులో లోపాలను తప్పుపడుతూ జాన్‌ మేజర్‌ 3,200 పేజీల నివేదిక ఇచ్చారు. ఉగ్రఫైనాన్స్‌ను, ఎయిర్‌లైన్స్‌ భద్రతను కెనడా విస్మరించిందని తప్పుపట్టారు. పర్మార్‌ బృందంపై నిఘా వేసిన సమయంలో సేకరించిన వైర్‌ ట్యాపింగ్‌ రికార్డులను దర్యాప్తు బృందాలే అనుమానాస్పద స్థితిలో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. 200 మంది సాక్షులను విచారించి, 17,000 రహస్య పత్రాలను పరిశీలించిన అనంతరం కెనడా ప్రభుత్వమే కనిష్క బాధితులను రెండుసార్లు మోసం చేసిందని తేల్చారు. దాడి ప్లాన్‌ తెలిసినా అడ్డుకోకుండా ఒకసారి.. దాడి తర్వాత బాధితులకు న్యాయం చేయకుండా రెండోసారి మోసం చేసిందని పేర్కొన్నారు.

నిజ్జర్‌ పౌరసత్వంపై మాటమార్చి రెండు తేదీలు..

ఇక తాజాగా నిజ్జర్‌ కేసులో తమ వద్ద ఇంటెలిజెన్స్‌ ఆధారాలున్నాయని కెనడా నొక్కి చెబుతోంది. కానీ, ఆ దేశ తీరు అనుమానాస్పదంగా ఉంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ సెప్టెంబర్ 19న ట్విటర్లో స్పందిస్తూ.. నిజ్జర్‌కు 2015 మార్చి 3న పౌరసత్వం ఇచ్చానని చెప్పారు. ఆ తర్వాత రోజే మాట మార్చి 2007 మే 25న కెనడా పౌరుడయ్యాడని అన్నారు. నిజ్జర్‌ పేరు 2007 అక్టోబర్‌లో లూధియానాలోని శ్రింగార్‌ థియేటర్‌లో బాంబుపేలుడు కేసులో బయటకు వచ్చింది. అంతకు కొన్ని నెలల ముందే తాము పౌరసత్వం ఇచ్చామని తాజాగా కెనడా చెప్పడం గమనార్హం.

భారత్‌పై మీడియా డ్రిప్‌ వ్యూహం.. ద్వంద్వ వైఖరి..!

తమ వద్ద నిజ్జర్‌ హత్యపై పక్కా ఇంటెలిజెన్స్‌ ఉందన్న కెనడా అదేమిటో బయటపెట్టడంలేదు. ఈ విషయంపై ఆ దేశ ప్రతిపక్షమే అసహనం వ్యక్తం చేస్తోంది. దౌత్యవేత్తలపై నిఘా వేయడం వియన్నా ఒప్పందానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల మీడియాకు మాత్రం రోజుకో లీకు ఇస్తోంది. అందులో కూడా కచ్చితమైన సమాచారం ఉండటంలేదు. గతంలో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి విషయంలో కూడా తుర్కియే ఇలానే సౌదీపై మీడియా లీకులు చేసింది. కానీ, ఇప్పుడు కెనడా ఓ ఉగ్రవాది కోసం ఈ వ్యూహం అనుసరిస్తోంది.

తమ గడ్డపై ఓ పౌరుడిని ఇతర దేశ ఏజెంట్లు హత్య చేయడాన్ని కెనడా ప్రధాని తప్పుపట్టారు. కానీ, అమెరికా పౌరుడైన ఖలిస్థాన్‌ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ.. కెనడా వచ్చి భారతీయ మూలాలున్న స్థానికులను బెదిరించడంపై మాత్రం ప్రభుత్వం మౌనం వహిస్తోంది. సొంత పార్లమెంట్‌లో నాజిని సత్కరిస్తుంటే దేశ ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తోందని ప్రతిపక్ష నేత పియరీ నిలదీశారు. ఇదీ అక్కడి రూల్‌ ఆఫ్‌ లా..! కనిష్క దాడి సమయంలో నాటి కెనడా ప్రభుత్వం ఉదాసీనతే ఆ దేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రదాడికి కారణమైంది. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రూడో ప్రభుత్వంపైనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని