Kenya: కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్‌.. డిఫెన్స్‌ చీఫ్‌తో పాటు 9 మంది అధికారులు మృతి

కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. 

Published : 19 Apr 2024 05:37 IST

నైరోబీ: కెన్యా (Kenya)లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం (Helicopter crash)లో ఆ దేశ డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లా(61)తో పాటు తొమ్మిది మంది మిలిటరీ ఉన్నతాధికారులు చనిపోయారు. రాజధాని నైరోబీ నుంచి 400 కి.మీ దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు. కెన్యా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. తీవ్ర విచారంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాద వార్త తెలియడంతో జాతీయ భద్రతా కౌన్సిల్‌తో అధ్యక్షుడు రూటో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి దేశ ఎయిర్‌ ఫోర్స్‌ బృందం అక్కడికి బయలుదేరినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దేశంలో సంతాప దినాలు పాటించాలని అధ్యక్షుడు ప్రకటించారు. పరాక్రమవంతులైన జనరల్స్‌, గాలంట్‌ అధికారులు, సర్వీస్‌ మెన్‌, ఒక మహిళా అధికారిని మాతృభూమి కోల్పోయినట్లు రూటో పేర్కొన్నారు. పైలట్‌ అయిన ఒగొల్లా ఏడాది మాత్రమే బాధ్యతలు చేపట్టారు. 40 ఏళ్లుగా ఆయన మిలిటరీలో సేవలు అందిస్తున్నారు. గత 12 నెలల కాలంలో ఐదు కెన్యా మిలిటరీ హెలికాప్టర్లు కూలిపోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని