Kim Yo Jong: జపాన్‌తో చర్చలకు సిద్ధమే.. కానీ..! కిమ్‌ సోదరి కీలక వ్యాఖ్యలు

జపాన్‌ విషయంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి, ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్‌ యో జోంగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చర్చలకు ముందుకు రావాలని జపాన్‌ ప్రధాని కిషిదా చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.

Published : 17 Feb 2024 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస క్షిపణి ప్రయోగాలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా ఉత్తర కొరియాకు జపాన్‌తో వైరి పరిస్థితులు (North Korea- Japan Relations) నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి, ఆ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా పేర్కొనే కిమ్‌ యో జోంగ్‌ (Kim Yo Jong) కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చర్చలకు ముందుకు రావాలని జపాన్‌ ప్రధాని కిషిదా చేసిన ప్రతిపాదనకు సానుకూల రీతిలో స్పందించారు! ఎప్పుడో ముగిసిపోయిన ‘జపాన్‌వాసుల అపహరణ’ వ్యవహారాన్ని పక్కనబెడితే సదస్సు తరహాలో చర్చలకు తామూ సిద్ధమేనని తెలిపారు.

క్షిపణి పరీక్షల విషయంలో ఐరాసలో తమను నిలదీసేందుకు యత్నిస్తోన్న చెడ్డ దేశాల జాబితాలో జపాన్‌ ఒకటని కిమ్‌ యో జోంగ్‌ గతంలో విరుచుకుపడ్డారు. తాజాగా మాత్రం.. కిషిదా ప్రతిపాదనలో సానుకూలతలు కనిపిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఒకరినొకరు గుర్తించి, శత్రుత్వాన్ని వీడి.. విశ్వసనీయ చర్యల ద్వారా సంబంధాలను చక్కదిద్దేందుకు రాజకీయపరంగా నిర్ణయం తీసుకుంటే.. ఇరుదేశాలు కలిసి కొత్త భవిష్యత్తుకు ద్వారాలు తెరవొచ్చు’’ అని ఆమె వ్యాఖ్యానించినట్లు స్థానిక వార్తాసంస్థ తెలిపింది. గత నెలలో జపాన్‌ భూకంపంలో మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైతం కిషిదాకు ఓ సందేశాన్ని చేరవేయడం గమనార్హం.

పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!

కిమ్ యో జోంగ్‌ తాజా వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాసా హయాషి శుక్రవారం తెలిపారు. ‘జపానీయుల అపహరణ’ వివాదాన్ని పరిష్కరించినట్లు ఆ దేశం పరిగణించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల మధ్య బలపడిన సంబంధాల్లో చీలిక తెచ్చేందుకే కిమ్‌ ప్రభుత్వం ఈమేరకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోందని ఓ మాజీ దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల నేతల భేటీ అసాధ్యమేనని పేర్కొన్నారు.

1970, 80ల్లో తమ దేశం నుంచి ఉత్తర కొరియా ఏజెంట్లు 17 మందిని అపహరించినట్లు టోక్యో చెబుతోంది. వీరిలో ఐదుగురు 2022లో స్వదేశానికి వచ్చారు. మిగతా వారిలో ఎనిమిది మంది చనిపోయారని, నలుగురు తమ దేశంలో లేరని ప్యాంగ్‌యాంగ్‌ పేర్కొంది. ఈ వివాదం ఇప్పటికే పరిష్కారమైనట్లు చెబుతోంది. జపాన్‌ మాత్రం ఈ వ్యవహారాన్ని లేవనెత్తుతూనే ఉంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికే ఉత్తర కొరియా నేతతో సమావేశానికి కిషిదా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని