Kachchatheevu: కచ్చతీవుపై రాజకీయ రగడ.. శ్రీలంక ఏమందంటే..?

తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం కచ్చతీవు అంశం రగడ సృష్టిస్తోంది. దీనిపై తాజాగా శ్రీలంక (Sri Lanka) నుంచి స్పందన వచ్చింది. 

Updated : 05 Apr 2024 11:06 IST

కొలంబో: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ భారత్‌లో కచ్చతీవు (Katchatheevu) ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంక (Sri Lanka)కు ఇచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్‌ దేవానంద స్పందించారు. కచ్చతీవును భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారమూ లేదని వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు భారత్‌లో ఎన్నికల సమయం నడుస్తోంది. ఇలాంటి ప్రకటనలు వినిపించడం సహజమే. 1974 నాటి ఒప్పందం ప్రకారం.. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినా, ఇరుదేశాల మత్స్యకారులు ప్రాదేశిక జలాల్లో రెండువైపులా చేపలు పట్టుకోవచ్చు. అయితే 1976లో మరో ఒప్పందం కుదిరింది’’ అని గుర్తు చేశారు. దాని ప్రకారం..సముద్రంలో సరిహద్దులు విభజించారు. ఒక దేశం జాలరులు మరొకరి జలాల్లో చేపల పట్టడం నిషిద్ధం. ‘‘కన్యాకుమారికి దిగువన వెస్ట్‌బ్యాంక్‌ పేరుతో పిలిచే ఒక ప్రాంతం ఉంది. విస్తృత వనరులతో ఉన్న ఆ ప్రాంతం కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దది. 1976 ఒప్పందం ప్రకారం అది ఇండియాకు దక్కింది’’ అని దేవానంద వెల్లడించారు.

కచ్చతీవుపై ఎన్నికల రచ్చ

ఇదిలా ఉంటే..ఈ ఏడాది ఇప్పటివరకు 178 మంది భారత మత్స్యకారుల్ని, 23 ఫిషింగ్ నౌకలను శ్రీలంక ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. తమిళనాడు జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన ప్రతిసారీ... వారిని విడిపించాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. వారి అరెస్టులను మోదీ అడ్డుకోవడంలేదని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. వాటిని గట్టిగా తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్‌, డీఎంకేలను ఒకేసారి ఇరకాటంలో పెట్టడం కోసమే భాజపా నేతలు కచ్చతీవు అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని