Emmanuel Macron: ఫ్రాన్స్‌లో ఘర్షణలు.. కచేరీలో అధ్యక్షుడు: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఫ్రాన్స్‌(France)లో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధ్యక్షుడు మేక్రాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

Updated : 01 Jul 2023 18:27 IST

పారిస్‌: పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి ఘటన ఫ్రాన్స్‌ (France)ను కుదిపేస్తోంది. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తునే ఉన్నారు. మంగళవారం నుంచి ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. కొన్ని తేలికపాటి సాయుధ వాహనాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు 1,100 అరెస్టులు చోటుచేసుకున్నాయని ఫ్రాన్స్‌ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్‌ డార్మానిన్ వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron) శాంతి కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 

మరోపక్క ఈ ఘటనల నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న మేక్రాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కన్సర్ట్‌ (కచేరీ)లో పాల్గొనడమే అందుకు కారణం. ఆ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిస్‌లో జరిగిన బ్రిటిష్ సింగర్ ఎల్టన్‌ జాన్‌ కన్సర్ట్‌కు మేక్రాన్‌, ఆయన సతీమణి ఇటీవల హాజరయ్యారు. ఆ వీడియోలు చూసి నెటిజన్లు మేక్రాన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘‘ఆందోళనకారులు ఫ్రాన్స్ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తుంటే.. మేక్రాన్‌ మ్యూజిక్ కన్సర్ట్‌లో ఉన్నారు. అక్కడ ఉత్సాహంగా సతీమణితో కలిసి కాలు కదిపారు’’ అంటూ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. నిజానికి ఆ ఈవెంట్‌ బుధవారం జరిగింది. అప్పటికి ఘర్షణలు ఉద్ధృతంగా లేవు. కానీ ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

అలాగే ఎల్టన్‌ జాన్‌తో కలిసి వారిద్దరు దిగిన ఫొటోను సింగర్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దాని కింద కూడా ఇలాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. ‘‘అల్లర్ల వేళ మేక్రాన్‌ తన హోం మంత్రికి అండగా ఉండకుండా ఎల్టాన్‌ను ప్రశంసించేందుకే మొగ్గుచూపారు’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘‘తన అధికారంలో ఉండగా ఒక టీనేజ్‌ పిల్లాడు చనిపోతే.. మేక్రాన్‌ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో ఇది సరికాదు’’ అని మరొకరు ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే.. హింసాత్మక ఘటనలపై శుక్రవారం మేక్రాన్‌ దేశ ప్రజలతో మాట్లాడారు. దేశంలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు యువతను ఇంటిపట్టునే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలంటూ అధికారులకు సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారాన్ని తొలగించే విషయమై ఆయా సంస్థలతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందని మేక్రాన్‌ తెలిపారు. హింసను ఎగదోసేందుకు సోషల్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునేవారిని గుర్తించేందుకూ ప్రయత్నిస్తామన్నారు. గురువారం రాత్రి అరెస్టు అయిన ఆందోళనకారుల్లో ఎక్కువమంది యువతే ఉన్నారని, వారిలో కొంతమంది మరీ చిన్నవారని, ఈ నేపథ్యంలో అటువంటివారిని గడప దాటకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని మేక్రాన్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని