Terror Attack:: ఆ ఉగ్రసంస్థ.. గతంలో ఫ్రాన్స్‌లోనూ దాడులకు యత్నం: మెక్రాన్‌

మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ గతంలో తమ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తెలిపారు.

Updated : 26 Mar 2024 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా రాజధాని మాస్కోలో మారణహోమానికి (Moscow Attack) పాల్పడింది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని చెప్పడానికి తమ వద్ద సమాచారం ఉందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) తెలిపారు. ఈ ఘటనలో ఉక్రెయిన్‌ (Ukraine)పై నిందమోపేందుకు రష్యా (Russia) యత్నించడం మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. ఈ ఉగ్రమూక గతంలో ఫ్రాన్స్‌నూ లక్ష్యంగా చేసుకుందన్నారు. 

‘‘మాస్కో దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ప్రకటించింది. మా నిఘావర్గాలకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కూడా ఇదే విషయం వెల్లడవుతోంది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఈ సందర్భాన్ని వాడుకోవడం రష్యాపై, దాని పౌరుల భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మాస్కో దాడికి బాధ్యత వహించిన ఉగ్రసంస్థ గతంలో ఫ్రాన్స్‌లోనూ దాడులకు యత్నించింది’’ అని మెక్రాన్‌ వ్యాఖ్యానించారు.

మాస్కో ఉగ్రదాడి.. నేరాన్ని అంగీకరించిన ముష్కరులు!

ఈ కాల్పులకు తామే తెగబడినట్లు అఫ్గాన్‌కు చెందిన ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు చెప్పినా.. పుతిన్‌ మాత్రం ఇప్పటివరకు ఈ పేరు ప్రస్తావించలేదు. అనుమానితులు నలుగురూ ఉక్రెయిన్‌ వైపు ముందే సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించగా తమ బలగాలు పట్టుకున్నాయని చెప్పారు. అయితే.. ఈ ఘటనలో తమకు ప్రమేయం లేదని ఉక్రెయిన్‌ ఇప్పటికే తేల్చిచెప్పింది. అమెరికా సహా ఇతర దేశాలు సైతం ఇస్లామిక్‌ స్టేట్‌పైనే అనుమానాలు వ్యక్తం చేశాయి. కీవ్‌ను అమెరికా కాపాడుతోందని రష్యా ఆరోపిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని