Maldives: మళ్లీ నోరుపారేసుకున్న ముయిజ్జు.. సివిల్‌ డ్రెస్సుల్లోనూ ఉండొద్దట..!

India-Maldives: భారత బలగాలు ఎట్టిపరిస్థితుల్లో తమ భూభాగంలో ఉండొద్దని మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు మరోసారి అన్నారు. పౌర దుస్తుల్లో కూడా వారిని అనుమతించబోమని తెలిపారు.

Published : 05 Mar 2024 13:53 IST

మాలె: భారత్‌ (India)తో వివాదం వేళ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu).. మరోసారి న్యూదిల్లీపై వ్యతిరేక గళం వినిపించారు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది (Indian troops) కూడా తమ భూభాగంలో ఉండకూదని అన్నారు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దంటూ నోరుపారేసుకున్నారు. సైనిక సహకారంపై మాల్దీవులు-చైనా మధ్య కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న భారత బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీనిపై ఫిబ్రవరి 2న దిల్లీ వేదికగా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బంది (Technical Personnel)ని నియమించేందుకు దిల్లీ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది. దీంతో గతవారమే భారత సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది.

భారత్‌తో వివాదం వేళ.. మాల్దీవులకు చైనా ‘ఉచిత’ సాయం

అయితే, దీనిపై మాల్దీవుల్లోని కొన్ని విపక్ష పార్టీలు కొత్త వాదన తెరపైకి తెచ్చాయి. సాంకేతిక సిబ్బంది వాస్తవానికి మిలిటరీ అధికారులేనని, పౌర దుస్తుల్లో వారిని పంపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై తాజాగా ముయిజ్జు స్పందిస్తూ.. ‘‘భారత బలగాల ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. ఇది చూసి తట్టుకోలేని విపక్షాలు కొత్త ట్విస్ట్‌లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు దేశంలో ఉండవు. కనీసం సివిల్‌ దుస్తుల్లోనూ వారిని ఉండనివ్వం’’ అని అన్నారు.

మాల్దీవుల్లోని మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు స్థానిక ప్రజలకు మానవతా సాయం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే, దిల్లీని దూరం పెడుతున్న ముయిజ్జు.. ఈ సేవల కోసం గతవారం శ్రీలంకతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంటే భవిష్యత్తులో అన్ని కేటగిరీల నుంచి భారత సిబ్బందిని వెనక్కి పంపించే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇక, చైనా అనుకూలనేతగా పేరున్న ముయిజ్జు.. ఊహించినట్లుగానే డ్రాగన్‌కు దగ్గరవుతున్నారు. తాజాగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందం జరిగింది. మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా ముందుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని