Moon lander Slim: జపాన్‌కు శుభవార్త.. కుదురుకున్న మూన్‌ ల్యాండర్‌

జపాన్‌ మూన్‌ ల్యాండర్‌ తిరిగి పనిచేయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని జాక్సా వెల్లడించింది. 

Updated : 29 Jan 2024 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జాబిల్లి పైకి జపాన్‌ ప్రయోగించిన ‘స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌ (స్లిమ్‌)’ తాజాగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇది చంద్రుడిపై దిగిన సమయంలో తలకిందులుగా పడింది. దీంతో సౌరఫలకాలకు కాంతి తాకని పరిస్థితి తలెత్తడంతో విద్యుదుత్పత్తి  చేయలేకపోయింది. కానీ, చంద్రుడిపై కాంతి గమనం మారడంతో తాజాగా సోలార్‌ ప్యానల్స్‌పై ఎండ పడటం మొదలైందని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రకటించింది. దీనిలోని సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో ఆదివారం రాత్రి ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించినట్లు తెలిపింది.

జనవరి 20వ తేదీన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగింది. అమెరికా, సోవియట్‌, చైనా, భారత్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్‌ నిలిచింది. అప్పటికే ఉన్న బ్యాటరీ శక్తితో కొన్ని గంటలు పనిచేసింది. ఆ తర్వాత సూర్యకిరణాలు దిశ మారి సౌరఫలకాలపై కాంతి పడే వరకు దానిని నిలిపివేశారు. తాజాగా దానిని యాక్టివేట్‌ చేయడంతో అది సమీపంలోని రాయిని ఫొటో తీసి పంపింది. దానికి ‘టాయ్‌ పూడ్లే’ అని పేరు పెట్టారు. సమీపంలోని రాళ్ల గుట్టపై స్లిమ్‌ విశ్లేషణ చేయనుంది. 

‘ఇది భయానక ట్రెండ్‌’: డీప్‌ఫేక్‌లపై సత్యనాదెళ్ల ఆందోళన

చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అత్యంత కష్టం. దీనికోసం చేసిన సగం ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాస్తవానికి స్లిమ్‌ ప్రయోగంలో అత్యంత కచ్చితత్వంతో ల్యాండింగ్‌ చేయడంపై జాక్సా దృష్టిపెట్టింది. ఇందుకు కేవలం 100 మీటర్ల వెడల్పైన జోన్‌ను మాత్రమే ఎంచుకొని అక్కడ ల్యాండర్‌ను దించగలిగింది. చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండే సుదీర్ఘ రాత్రులను తట్టుకొని పనిచేసేటట్లు దీనిని డిజైన్‌ చేశామని జాక్సా గతంలో వెల్లడించింది. ఈనెల మొదట్లో అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ కూడా లూనార్‌ మిషన్‌ చేపట్టగా అది పసిఫిక్‌ సముద్రంలో కూలిపోయి విఫలమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని