Maldives: మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారని, దేశ స్వతంత్రతను విదేశీ చేతుల్లో పెట్టారని ముయిజ్జు ఆరోపించారు.

Published : 29 Mar 2024 20:24 IST

మాలే: మాల్దీవుల (Maldives) మాజీ పాలకుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌పై అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన పదవీకాలంలో ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారని, దేశ స్వతంత్రతను పరాయి దేశం చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఆ దేశం, రాయబారి పేరు ప్రస్తావించనప్పటికీ.. భారత్‌తో విభేదాలు కొనసాగుతోన్న వేళ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తుర్కియే నుంచి డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి ఎదురవుతోన్న విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో ఈమేరకు స్పందించారు.

‘‘2018-23 వరకు అధికారంలో ఉన్న మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి ఆ సమయంలో పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ.. దేశ స్వతంత్రతను కాపాడటంలో ఆ పార్టీ విఫలమైంది. పైగా దాన్ని విదేశీ చేతుల్లో పెట్టింది. మాజీ అధ్యక్షుడు సోలీహ్ ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారు. ఫలితంగా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆర్థికం సహా అనేక రూపాల్లో స్వాతంత్ర్యం కోల్పోయాం. ఇవన్నీ చేసినవారు.. ఇప్పుడు వీటన్నింటిని సరిదిద్దేందుకు, ప్రజలు కోరుకునేలా దేశాన్ని మలిచేందుకు మేం చేసే ప్రయత్నాలను సహజంగానే అంగీకరించరు’’ అని ముయిజ్జు వ్యాఖ్యానించారు.

స్వరం మార్చిన ముయిజ్జు.. రుణవిముక్తి చేయాలని విజ్ఞప్తి

సోలిహ్‌ ప్రభుత్వం పాలనాపర విషయాల్లో భారత్‌పై ఎక్కువగా ఆధారపడిందని ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) ఆరోపిస్తుండగా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ దేశంతో పాత సంబంధాలను నాశనం చేసిందని ఎండీపీ విమర్శిస్తోంది. చైనాకు అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుంచి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నారు. మన దేశానికి చెందిన భద్రతా బలగాలను తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే.. ఇటీవల రుణ విముక్తి కోసం మాత్రం భిన్న స్వరం వినిపించారు. భారత్‌ ఎప్పటికీ సన్నిహిత మిత్ర దేశమేనని, ఆ దేశం నుంచి రుణ మినహాయింపును కోరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని