Cybertruck: సైబర్‌ట్రక్‌ ట్రంప్‌ హోటల్‌ను కాపాడింది: మస్క్‌

Eenadu icon
By International News Team Updated : 02 Jan 2025 12:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Cybertruck ఇంటర్నెట్‌డెస్క్‌: లాస్‌ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్‌ హోటల్‌ వద్ద జరిగిన దాడిలో ఉన్న సైబర్‌ ట్రక్‌ నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించినట్లు తెలుస్తోంది. భారీ పేలుడు తర్వాత కూడా ఈ వాహనం అద్దాలు మినహా మిగిలిన భాగాలేవీ పెద్దగా దెబ్బతినలేదు. దీనిపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఆన్‌లైన్‌ వేదిక ఎక్స్‌లో వరుస పోస్టులకు స్పందిస్తూ.. ‘‘ ట్రంప్‌ హోటల్‌ వద్ద జరిగిన పేలుడుకు అద్దెకు తెచ్చిన ఓ సైబర్‌ ట్రక్‌లో బెడ్‌పై అమర్చిన భారీ మందుగుండు కారణమని ధ్రువీకరిస్తున్నాం. దీనిలో వాహనలోపం లేదు. పేలుడు జరిగే సమయానికి ఆ సైబర్‌ ట్రక్‌లోని అన్ని టెలిమెట్రీలు సక్రమంగానే పని చేస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.  

మరో పోస్టులో మస్క్‌ స్పందిస్తూ..‘‘కారు బాంబులకు సైబర్‌ ట్రక్‌ను ఎన్నుకోవడం చెత్త నిర్ణయం కావచ్చు. మిగిలిన ఏ వాణిజ్య వాహనానికి సాధ్యం కాని రీతిలో సైబర్‌ ట్రక్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కవచం పేలుడు తీవ్రతను అడ్డుకొంది. ఆ దుర్మార్గులు ఉగ్రదాడికి తప్పుడు వాహనాన్ని ఎంచుకొన్నారు. వాస్తవంగా సైబర్‌ ట్రక్‌లో పేలుడు పదార్థాలున్నాయి. కానీ, వాటి తీవ్రతకు అక్కడ లాబీకి ఉన్న గాజు అద్దాలు కూడా పగల్లేదు’’ అని మస్క్‌ అభివర్ణించాడు. తాజాగా పేలుడులో దెబ్బతిన్న ట్రక్కును మళ్లీ పనిచేసేలా చేస్తామని అతడు క్లో కోల్‌ అనే ఎక్స్ వినియోగదారుడికి వెల్లడించాడు. 

వాస్తవానికి మస్క్‌ ఈ ట్రక్కు విక్రయానికి ముందు ప్రదర్శనకు ఉంచినప్పుడు దానిని దృఢత్వానికి చిహ్నంగా చూపించారు. నాడు సుత్తులతో కొట్టించి.. ఇనుపగుండ్లతో దాడి చేయించి మరీ ప్రదర్శించాడు.  

మోర్టార్లు.. ఇంధనాల డబ్బాలు..

పేలుడు జరిగే సమయానికి వాహనంలో మోర్టార్‌లు, క్యాంప్‌ ఫ్యూయల్‌ కెనిస్టర్లు ఉన్నాయి. దీనిపై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ షరీఫ్‌ కెవిన్‌ మెక్‌మహిల్‌  మాట్లాడుతూ ట్యూరో కార్‌ షేరింగ్‌ యాప్‌ వాడి కొలరాడోలో ఎవరు సైబర్‌ ట్రక్‌ను అద్దెకు తీసుకొన్నారో గుర్తించాము. కానీ, దర్యాప్తు పూర్తయ్యేవరకు అతడి పేరును వెల్లడించమన్నారు. ఈ పేలుడులో మరణించింది అతడేనని నిర్ధరణ కావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కొలరాడో స్ప్రింగ్స్‌కు చెందిన మాథ్యూ లివెల్స్‌బెర్గర్‌గా అతడిని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్‌బీఐ సిబ్బంది పెద్దఎత్తున ఆ ప్రాంతానికి చేరుకొన్నారు.

ఎవరీ మాథ్యూ..

37 ఏళ్ల మాథ్యూ గతంలో అమెరికా ప్రత్యేక దళమైన గ్రీన్‌ బెరెట్స్‌లో పనిచేశాడు. ఆ దళంలోని కమ్యూనికేషన్‌, ఇంటెలిజెన్స్‌ నిపుణుడిగా, అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ విభాగంలోను అతనికి అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడి ఎక్స్‌ హ్యాండిల్‌ ఆధారంగా గుర్తించారు. ఈ పేలుడులో అతడు కూడా మరణించాడు. నేడు అమెరికాలోని ఆర్లీన్‌లో జరిగిన దాడిలో కూడా మజీ సైనికుడే ప్రధాన నిందితుడు కావడం గమనార్హం.

న్యూ ఆర్లీన్‌, లాస్‌వెగాస్‌లో జరిగిన రెండు దాడులకు అద్దె కార్లను వాడారు. ఈ రెండు ట్యూరో అనే యాప్‌ నుంచే అద్దెకు తీసుకొన్నారు. ఈ యాప్‌లో కార్ల యజమానులు తమ వాహనాలను అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. దీనిలో ఖరీదైన స్పోర్ట్స్‌ కార్ల నుంచి మినీ వ్యాన్ల వరకు వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. ఈ దాడులకు వాడిన ఫోర్డ్‌, టెస్లా వాహనాలు రెండూ అత్యాధునికమైనవే. 

Tags :
Published : 02 Jan 2025 11:53 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు