Canada Envoy: ‘కెనడా- భారత్‌ సంబంధాలు.. స్నేహపూర్వకంగా మార్చేందుకు కృషి!’

కెనడా, భారత్‌ల వ్యాపార సంబంధాలపై ఇటీవలి దౌత్యవివాదం ఏ మాత్రం ప్రభావం చూపలేదని భారత్‌లోని కెనడా హైకమిషనర్‌ కామెరూన్‌ మెక్‌కే తెలిపారు.

Published : 11 Jan 2024 20:31 IST

గాంధీనగర్: భారత్‌, కెనడాల మధ్య ఉద్రిక్తతలు (India Canada Row) నెలకొన్నప్పటికీ.. ఇరు దేశాల దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు ఏకరీతిలోనే ఉన్నాయని భారత్‌లోని కెనడా హైకమిషనర్‌ కామెరూన్‌ మెక్‌కే పేర్కొన్నారు. ‘వైబ్రంట్‌ గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు (Vibrant Gujarat Summit)’లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇరుదేశాల వ్యాపార సంబంధాలపై దౌత్యవివాదం ఏ మాత్రం ప్రభావం చూపలేదని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు ప్రభావితమైన విషయం తెలిసిందే.

‘‘రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇది రహస్యమేమీ కాదు. కానీ, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలు కొనసాగేలా ఇరువైపులా నాయకత్వం, వ్యాపార వర్గాల నుంచి ప్రోత్సాహం లభించింది. ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యం, అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. కెనడా, భారత ప్రభుత్వాలకు, వ్యాపార వర్గాలకు ఒకటే సలహా. ప్రభుత్వాలు చేస్తున్న పనిని చేయనివ్వండి. దౌత్యం కొనసాగనివ్వండి. అదే సమయంలో వ్యాపార సంబంధాలనూ ఎప్పటిలాగే నిర్వహిద్దాం. మన వ్యాపారాన్ని, దేశాలను మళ్లీ స్నేహపూర్వకంగా మార్చేందుకు కలిసి పని చేద్దాం’’ అని మెక్‌కే పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని